
Chandrababu
Chandrababu : నిన్నటి (సోమవారం) పోలింగ్ లో వైసీపీ గూండాల దాడులను ధైర్యంగా ఎదిరించిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ప్రజలపై పోలింగ్ అనంతరం కూడా దాడులకు తెగబడుతున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. ఇప్పటికీ పల్నాడు, చంద్రగిరి సహా పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం ఆందోళనకరమన్నారు. ఇప్పటికైనా ఎన్నికల సంఘం, పోలీసు ఉన్నతాధికారులు రాష్ట్రంలో శాంతిభద్రతలను పునరుద్ధరించడంపై దృష్టి పెట్టాలని ఆయన కోరారు. హింసను ప్రేరేపిస్తున్న శక్తులపై కఠినంగా వ్యవహరించి ప్రజలకు రక్షణ కల్పించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
ఏపీలో జరిగిన శాసనసభ, లోక్ సభ ఎన్నికల పోలింగ్ రాత్రి పొద్దుపోయే వరకు కొనసాగింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో కొట్లాటలు, గాలిలోకి కాల్పులు, రాళ్లు విసరడాలు, రక్తం కారడాలు, పెట్రోలు బాంబులు, ఈవీఎం ధ్వంసాలు, కిడ్నాపులు, అధికారుల సస్పెన్షన్లు కొనసాగాయి. మరోవైపు రాత్రి పొద్దుపోయే వరకు క్యూలైన్లలో నిల్చొని మరీ ప్రజలు తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు.