AP Election Schedule : ఈసీ ఉన్నత స్థాయి సమీక్ష : ఏపీ ఎన్నికల షెడ్యూల్‌పై ఉత్కంఠత
AP Election Schedule : ఏపీ లో అసెంబ్లీ ఎన్నికలకు ఏప్రిల్ చివరి వారం వరకు ఎన్నికలు రానున్నాయి. సార్వత్రిక ఎన్నికలు కూడా ఉన్న నేపథ్యంలో రెండు కలిసే నిర్వహించే అవకాశంపై ఈసీ ఆలోచిస్తుంది. ఈ నేపథ్యంలో మే చివరి నాటికి కొత్త ప్రభుత్వం ఏర్పడ నుందని తెలుస్తోంది.
ఈ పరిణామాల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల కమిషన్ (ఈసీ).. ఏపీ ఎన్నికల ప్రక్రియపై దృష్టి పెట్టింది. షెడ్యూల్ విడుదలకు ఎంతో సమయం లేకపోవడంతో సమీక్ష, సమావేశాలు నిర్వహిస్తోంది. సిస్టమేటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్ట్రోరల్ పార్టిసిపేషన్ (స్వీప్) డైరెక్టర్ సంతోష్ అజ్మీరా, అధికారులు వెలగపూడి సచివాలయంలో నోడల్ అధికారులతో సమీక్ష ఏర్పాటు చేశారు. అన్ని జిల్లాల స్వీప్ నోడల్ అధికారులు ఈ సమావేశంలో ఉన్నారు.
సార్వత్రిక ఎన్నికలను పటిష్టంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు పూర్తి చేయాలని సంతోష్ అజ్మీరా అధికారులను ఆదేశించారు. షెడ్యూల్ ప్రకటన, నోటిఫికేషన్ జారీకి ఎక్కువ సమయం లేదని, పోలింగ్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. పోలింగ్ పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, ప్రత్యేకించి కొత్త ఓటర్లను చైతన్య పరిచి బూత్ కు రప్పించడంలో అధికారులు సఫలీకృతం కావాలని కోరారు.
ఈవీఎంల వినియోగం, వీవీ ప్యాట్‌పై అవగాహన కోసం శిబిరాలను నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. పోలింగ్ పర్సంటేజ్ పెంపుపై అన్ని చర్యలు తీసుకోవాలని అజ్మీరా సూచించారు. ఎన్నికల నిర్వహణ మార్గదర్శకాలను అన్ని జిల్లాలకు పంపించామని ముఖేష్ కుమార్ మీనా గుర్తు చేశారు. వాటిపై ఎన్నికల అధికారులు అవగాహన పెంచుకోవాలని, ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా చూడాలని సంతోష్ అజ్మీరా సూచించారు.