AP Polling : ఏపీలో రికార్డు స్థాయిలో పోలింగ్..81.76 శాతం నమోదైనట్లు ఈసీ ప్రకటన
AP Polling : ఏపీలో సార్వత్రిక ఎన్నికల హడావుడి ముగిసింది. ఎలక్షన్స్ అయిపోయిన 24 గంటల తర్వాత తుది పోలింగ్ శాతాన్ని ఎన్నికల సంఘం అర్ధరాత్రి ప్రకటించింది. రాష్ట్రంలో రికార్డుస్థాయి పోలింగ్ నమోదైంది. ఈవీఎంలలో పోలైన ఓట్లను 17ఏ రిజిస్టర్ తో పోల్చి చూసిన తర్వాత ఈ నిర్ధారణకు వచ్చింది. ఈవీఎంల్లో నమోదైన ఓట్లు, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కలిపి 81.76 శాతం మేర పోలింగ్ జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని శాసనసభ నియోజకవర్గాల్లో సరాసరిన 80.07 శాతం పోలింగ్ నమోదు కాగా, పోస్టల్ బ్యాలెట్ 1.10 శాతం మేర నమోదైంది.
ఏపీలో తాజాగా జరిగిన ఎన్నికల్లో తుది పోలింగ్ శాతం 80.66 గా ఎన్నికల సంఘం ప్రకటించింది. అత్యధికంగా ప్రకాశం జిల్లాలో 87.09, పల్నాడు జిల్లాలో 85.65, బాపట్ల జిల్లాలో 84.98, కృష్ణా జిల్లాలో 84.05శాతం పోలింగ్ నమోదైంది. కోనసీమ జిల్లాలో 83.91, అనకాపల్లి జిల్లాలో 83.84, ఏలూరు జిల్లాలో 83.55 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం తెలిపింది. అత్యల్పంగా విశాఖపట్నం జిల్లాలో 68.63 శాతం నమోదైంది. ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో అత్యధికంగా 90.91 శాతం పోలింగ్ నమోదు అయినట్లు తెలుస్తోంది. తిరుపతి నియోజకవర్గంలో అత్యల్పంగా 63.32 శాతం నమోదైంది. అత్యధికంగా ఒంగోలు పార్లమెంటుకు 87.06 శాతం పోలింగ్ నమోదు అయింది. అత్యల్పంగా విశాఖ పార్లమెంటుకు 71.11 శాతం పోలింగ్ నమోదైంది.
రాష్ట్రంలో కనీవినీ ఎరుగని రీతిలో పోలింగ్ జరగడంపై అన్ని పొలిటికల్ పార్టీలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్రంలో పెరిగిన పోలింగ్ శాతం తమకే మేలు చేస్తుందని అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ, జనసేన, బీజేపీ చెప్తున్న నేపథ్యంలో ఈసీ తాజా గణాంకాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా ఈసీ అంచనా వేసిన 81 శాతాన్ని మించి పోలింగ్ జరిగినట్లు తేలడంతో ఇది ఎవరిని తేల్చనుందో, మరెవరి ముంచనుందో అన్న ఉత్కంఠ నేతల్లో నెలకొంది. సాధారణంగా పోలింగ్ శాతం పెరిగితే అధికార పార్టీ కంటే విపక్షాలకే మేలవుతుందన్న అంచనాలు ఉన్నాయి. ఇవి నిజమో కాదో తెలియాలంటే జూన్ 4వరకు ఆగాల్సిందే.