AP DGP : ఏపీ నూతన డీజీపీగా ద్వారకా తిరుమలరావు నియమితులయ్యారు. ఏపీ డీజీపీగా ద్వారకా తిరుమలరావును ప్రభుత్వం నిన్న రాత్రి నియమించిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకూ డీజీపీగా ఉన్న హరీష్ గుప్తాను తిరిగి హోం సెక్రటరీగా ప్రభుత్వం బదిలీ చేసింది. ద్వారకా తిరుమలరావు నిన్నటి వరకూ ఆర్టీసీ ఎండీగా విధులు నిర్వహించారు.
1989 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన ద్వారకా తిరుమల రావు సీనియారిటీ జాబితాలో ప్రథమ స్థానంలో ఉండడంతో ఆయనను నియమిస్తూ చీఫ్ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన కర్నూలు ఏఎస్పీగా తన తొలి పోస్టింగ్ ను ప్రారంభించారు. అనంతరం కామారెడ్డి, ధర్మవరంలో ఏఎస్పీగా పనిచేశారు. నిజామాబాద్ లోనూ విధులు నిర్వహించారు. కడప, మెదక్ జిల్లాల ఎస్పీగా కూడా విధులు నిర్వహించారు. ఆక్టోపస్, కౌంటర్ ఇంటలిజెన్స్ సెల్ విభాగాల్లో ఐజీగా కూడా పనిచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ గా తర్వాత విజయవాడ పోలీస్ కమిషనర్ గా పని చేశారు. 2021 నుంచి ఆర్టీసీ ఎండీగా పని చేస్తున్నారు.