Dussehra celebrations 2024 : బెజవాడ ఇంద్రకీలాద్రిలో దసరా ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. పది రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో భారీ సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. భక్తుల సౌకర్యం కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. తొలిరోజు కనకదుర్గమ్మ తల్లి శ్రీ బాలత్రిపుర సుందరీదేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇస్తున్నారు. త్రిపురిని భార్య త్రిపుర సందరీ దేవి, అంటే ఈశ్వరుడి భార్త గౌరీదేవి అని అర్థం. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము త్రిపుర సుందరీదేవి అధీనంలో ఉంటాయి.
అభయ హస్త ముద్రతో, అక్షమాల ధరించిన అమ్మను ఆరాధిస్తే మనో వికారాలు తొలగిపోతాయి. నిత్య సంతోషం కలుగుతుంది. త్రిపుర సుందరీదేవి శ్రీ చక్రములోని త్రిపురాత్రయములో మొదటి దేవత. ఉపాసకులు త్రిపుర సుందరీదేవి అనుగ్రహము కోసము బాలార్చన చేస్తారు. సత్సంతానాన్ని అనుగ్రహించే దేవతగా త్రిపురసుందరీ దేవి భక్తుల పూజలందుకుంటోంది.
అలాగే బాలా శబ్దానికి జ్ఞానం అని అర్థం కూడా ఉంది. బాలా స్వరూపమైన అమ్మవారికి ఎవరు అర్చిస్తారో వారు జ్ఞానానందంతో కామక్రోధాలను జయించి ఆత్మానందాన్ని పొందగలరు. అందుకే నవరాత్రుల్లో ప్రథమ దివసాన అమ్మవారిని బాలపరమేశ్వరిగా ఆరాధన చేసి అజ్ఞానాన్ని పారద్రోలడానికి ప్రయత్నించాలి. విద్యోపాసకులకు మొట్టమొదట బాలా మంత్రాన్ని ఉపదేశిస్తారు. బాలాదేవి అనుగ్రహం పొందితేనే మహాత్రిపుర సుందరీ దేవి అనుగ్రహాన్ని పొందగలుగుతారని, దసరా మహోత్సవాలలో భక్తులకు పూర్ణఫలం అందించే అలంకారం శ్రీబాలాదేవి అని ప్రతీతి.