Dunki:భారతదేశంలో సీబీఎఫ్‌సి అధికారుల్లో లంచగొండితనం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. తమిళ చిత్రం మార్క్ ఆంటోని హిందీ వెర్షన్ సెన్సార్ కోసం తన నుంచి 6.5లక్షలు డిమాండ్ చేసారని హీరో విశాల్ ఆరోపించగా దీనిపై విచారణ సాగింది. అదంతా అటుంచితే ఇప్పుడు రాజ్ కుమార్ హిరాణీ తెరకెక్కించిన డంకీలో లైంగిక హింస, విద్వేషం, హింసాత్మక దృశ్యాలకు కొదవేమీ లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమాకి యుఏ సర్టిఫికెట్ వచ్చింది. దీనిపై ఇప్పుడు సౌత్ లో సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
మరోవైపు బ్రిటీష్ బోర్డ్ ఆఫ్ ఫిలిం క్లాసిఫికేషన్ (బిబిఎఫ్‌సి) ఖాన్ నటించిన డంకీ చిత్రానికి 15 ప్లస్ కేటగిరీ వారికి మాత్రమేనని సర్టిఫై చేసింది. అంటే 15 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ వయసున్న వారు మాత్రమే డంకీ చూడాలి. 15ఏళ్లలోపు బాలబాలికలు ఈ సినిమాని చూడకూడదు. దీనిని బట్టి డంకీలో వయోలెన్స్, అత్యాచారాలను ఎలా చూపించారోనన్న ఆసక్తికర చర్చ సాగుతోంది. హిరాణీ ముఖ్యంగా సున్నితమైన భావోద్వేగాలపై దృష్టి సారించి సినిమాలు తెరకెక్కిస్తారు. డంకీ కామెడీ డ్రామానే కాదు యాక్షన్ ఎంటర్ టైనర్ అని కూడా అంటున్నారు.
ఏది ఏమైనా సలార్ లో హింస రక్తపాతం ఎక్కువగా ఉన్నందున 18 ప్లస్ కేటగిరీ వారికే వర్తింప జేస్తూ బీబీఎఫ్‌సి సర్టిఫికేషన్ చేయడంతో దానిపై విమర్శలు వచ్చాయి. ఇప్పుడు షారూఖ్ సినిమా అంతకు తక్కువేమీ కాదని క్లారిటీ వచ్చేసింది. విదేశాల్లో ఈ సర్టిఫికేషన్ ఆధారంగానే థియటర్లలో క్రౌడ్ పుల్లింగ్ జరుగుతుంది. చిన్నారులు వీక్షించేందుకు అవకాశం లేదు కాబట్టి ఆ మేరకు వసూళ్లు తగ్గేందుకు అవకాశం ఉంది.
డిసెంబర్ 21న డంకీ విడుదలవుతుండగా, డిసెంబర్ 22న సలార్ విడుదలవుతోంది. ఈ రెండు సినిమాలు అత్యంత క్రేజీగా విడుదలవుతున్నాయి. అయితే ప్రపంచవ్యాప్తంగా ఓపెనింగుల్లో సలార్ సంచలనాలు సృష్టించనుందని టాక్ వినిపిస్తోంది. డంకీ చిత్రాన్ని కేవలం హిందీ ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకుని తీసారు కాబట్టి దానిని ఇతర భాషల్లోకి అనువదించి రిలీజ్ చేయలేదు. దీనివల్ల డంకీ రేసులో కొంత వెనకబడడం ఖాయం. హిందీ బెల్ట్ లో డంకీ, సలార్ ఒకదానితో ఒకటి పోటీపడుతుండడం ఆసక్తికరం.