Drunk and drive : బంజారాహిల్స్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్న ఎస్సై, హోంగార్డుపై మహిళలు దాడి చేశారు. బంజారాహిల్స్ పోలీసులు తెలిపిన ప్రకారం.. ఆదివారం రాత్రి ట్రాఫిక్ ఎస్సై అవినాశ్ బాబు, హోంగార్డు నరేష్ తదితరులు డ్రంక్ లండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నారు. అర్ధరాత్రి దాటిన తర్వాత అటుగా వచ్చిన హ్యుందాయ్ (ఎంహెచ్ 12 క్యూఎం 2092)ను నిలిపారు. కారు నడుపుతున్న మహిళకు నరేష్ శ్వాస పరీక్షలు నిర్వహించేందుకు ప్రయత్నించగా నిరాకరించి చివాట్లు పెట్టారు. కారులో మరో ముగ్గురు మహిళలు ఉన్నారు.
కారు నడుపుతున్న మహిళ హోంగార్డు సెల్ ఫోన్ ను లాక్కొని నేలకేసి కొట్టింది. ప్రశ్నించేందుకు వచ్చిన ఎస్సై అవినాశ్ బాబు ధరించిన బాడీ కెమెరాను సైతం ధ్వంసం చేసింది. అంతలోనే అక్కడికి వచ్చిన ఇద్దరు యువకులు నరేష్ ను తిట్టి కిందకునెట్టేశారు. మహిళలు అక్కడి నుంచి జారుకున్నారు. కాగా, పోలీసులు ఆ ఇద్దరు యువకులను పట్టుకొని బంజారాహిల్స్ పోలీసులకు అప్పగించారు. వారి రక్తంలో మద్యం మోతాదు శాతం 70 ఎంజీ, 20 ఎంజీ వచ్చినట్లు గుర్తించారు. హోంగార్డు నరేష్ ఫిర్యాదు మేరకు పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.