Visakha Drugs : విశాఖలో భారీగా పట్టుబడ్డ డ్రగ్స్..ఓ పార్టీ నేతకు లింక్?
Visakha Drugs : ఏపీలో భారీ ఎత్తున డ్రగ్స్ పట్టుబడడం దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. విశాఖ పోర్టులో 25వేల కేజీల డ్రగ్స్ పట్టుబడింది. బ్రెజిల్ నుంచి విశాఖ తీరానికి వచ్చిన కంటైనర్ లో భారీ ఎత్తున కొకైన్ దొరకడం కలకలం రేపుతోంది. డ్రైఈస్ట్ తో మిక్స్ చేసిన బ్యాగుల్లో డ్రగ్స్ ను తరలిస్తుండగా అధికారులు ఈ కంటైనర్ ను స్వాధీనం చేసుకున్నారు.
ఇంటర్ పోల్ ఇచ్చిన విశ్వసనీయ సమాచారంతో సీబీఐ అధికారులు విశాఖ పట్టణం పోర్ట్ లో ఈ మత్తు పదార్థాలను పట్టుకున్నారు. కొకైన్ ను ఈస్ట్ సంచులలో కలిపినట్లు కేంద్ర దర్యాప్తు ఏజెన్సీ గుర్తించింది. మొత్తం సరుకులో ఎంత శాతం మత్తు పదార్థాలు ఉన్నాయనే విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు.
జర్మనీలోని హ్యాంబర్గ్ మీదుగా కంటైనర్ ఈ నెల 16న విశాఖ పట్టణం వచ్చినట్లు అధికారులు గుర్తించారు. బ్రెజిల్ నుంచి విశాఖ పట్టణంలోని సంధ్యా ఎక్స్ పోర్ట్స్ కు సంబంధించిన యాజమాన్యంపై సీబీఐ కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. తాజాగా ఈ కేసులో ఏపీకి చెందిన ఓ పార్టీ నేత ఉన్నారనే ప్రచారం జరుగుతోంది.
డ్రగ్స్ కు సంబంధించిన కేసులో ఏపీ నేత ఉన్నారని సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. విశాఖలోని ఓ ప్రైవేట్ కంపెనీకి ఈ ఆర్డర్ వచ్చిందని.. ఆ కంపెనీ ఓ పార్టీకి చెందిన ఓ నేతదని అంటున్నారు. అయితే ఆ నేత పేరు మాత్రం బయటకు వెల్లడించలేదు. దీనిపై విచారణ చేపట్టిన సీబీఐ అధికారులు డ్రగ్స్ మాఫియా వెనక ఎవరెవరు ఉన్నారో తెలుసుకునే పనిలో పడ్డారు.