AP Politics-Drugs : ఏపీ రాజకీయాల్లో డ్రగ్స్ కలకలం..ఒకరిపై ఒకరు దుమ్మెత్తి..
AP Politics-Drugs : ఏపీలో ఎన్నికల సమయంలో భారీ ఎత్తున డ్రగ్స్ దొరకడం కలకలం రేపుతోంది. ఇక రాజకీయమంతా దీని చుట్టే తిరుగుతోంది. ఇప్పటికే అధికార, ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. వారికి అనుకూలమైన మీడియాలో ఎదుటివారిపై కథనాలు వండివారుస్తున్నారు. బ్రెజిల్ నుంచి విశాఖ పోర్టుకు వచ్చిన ఓ కంటైనర్ లో పాతిక వేల కిలోల సరుకు చిక్కడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.
డ్రగ్స్ దొరకడంపై రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు ఒకరిపై ఒకరు ఆరోపణాస్త్రాలు సంధించుకుంటున్నారు. గంజాయి నుంచి ఇతర డ్రగ్స్ వరకు అన్ని వ్యాపారాల్లో వైసీపీ లీడర్లు పండిపోయారని టీడీపీ ఆరోపిస్తోంది. ఇప్పుడు దొరికిన కంటైనర్ కూడా వారిదేనంటోంది. బ్రెజిల్ నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి వ్యాపారం చేస్తున్నారని తాము ఎప్పటి నుంచో చెబుతున్నామని ఇప్పుడు దొంగలు దొరికారని లోకేశ్ ట్వీట్ చేశారు. మరో ట్వీట్ లో ఆయనే..‘‘ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ జగన్ ముఠా పాపాల పుట్ట ఒక్కొక్కటిగా బద్దలవుతోంది. ఇక ఎలాగూ అధికారంలోకి రావడం అసాధ్యమని తేలిపోవడంతో అఖరి గడియల్లో వైసీపీ చీకటి మాఫియాలు జాక్ పాట్ లు కొట్టే పనిలో నిమగ్నమయ్యాయి. విశాఖలోని ఓ ప్రైవేట్ కంపెనీ పేరుతో ఈ డ్రగ్స్ దిగుమతి చేసుకున్నాయంటే జె-గ్యాంగ్ ఎంత బరితెగించిందో అర్థం చేసుకోవచ్చు. ఈ భారీ డ్రగ్స్ మాఫియాకు కేరాఫ్ అడ్రస్ నూటికి నూరు పాళ్లు తాడేపల్లి ప్యాలెస్. గతంలో కాకినాడ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి బినామీకి చెందిన ఓ డబ్బా కంపెనీ(ఆషీ ట్రేడింగ్ కంపెనీ, విజయవాడ) పేరుతో వచ్చిన 21 వేల కోట్ల విలువైన డ్రగ్స్ ను ముంద్రా పోర్టులో స్వాధీనం చేసుకుంది. ఈ చీకటి వ్యవహారాలను బయటపెట్టామన్న అక్కసుతోనే గతంలో వైసీపీ మూకలు టీడీపీ కేంద్ర కార్యాలయంపై కూడా దాడికి తెగబడ్డాయి. విశాఖను రాజధాని చేయడం దేవుడెరుగు..డ్రగ్స్ క్యాపిటల్ గా మార్చావు కదా జగన్?’’ అంటూ ప్రశ్నించారు.
అలాగే డ్రగ్స్ రాకెట్ పై చంద్రబాబు, పవన్ కూడా స్పందించారు. కాగా, టీడీపీ ఆరోపణలపై వైసీపీ కూడా ప్రత్యారోపణలు చేసింది. డ్రగ్స్ లో దొరికిన వారంతా టీడీపీ కి చెందిన నేతలే అంటూ ఆరోపించింది. టీడీపీని తెలుగు డ్రగ్ పార్టీ అంటూ ఎద్దేవా చేస్తూ వైసీపీ ట్వీట్ చేసింది. అయితే నిజనిజాలు ఎలా ఉన్నా..ఇది సీబీఐ, ఇంటర్ పోల్ పరిధిలో ఉండడంతో అసలు దొంగలెవరో వారి విచారణలో తేలనుంది. అయితే ఎన్నికల వేళ పార్టీలకు డ్రగ్స్ కేసు మంచి ఆయుధంగా మారనుంది.