Rains : ద్రోణి ప్రభావం.. తెలుగు రాష్ట్రాల్లో వానలు
Rains : తెలుగు రాష్ట్రాల్లో ఎండలు తీవ్రమయ్యాయి. భానుడి భగభగలకు ప్రజలు బయటకు రావడం లేదు. జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ఏపీ, తెలంగాణలో వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ ఛత్తీస్ గఢ్ నుంచి రాయలసీమ వరకు తెలంగాణ మీదుగా సముద్ర మట్టానికి 0.9 కి.మీ. ఎత్తులో ద్రోణి విస్తరించి ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ ప్రభావంతో మే 7న ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ (అమరావతి) పేర్కొంది.
శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, పల్నాడు, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడవచ్చని అంచనా వేసింది. మిగిలిన చోట్ల తేలికపాటి వర్షం పడుతుందని తెలిపింది. తెలంగాణలో మే 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సూచించింది.