Google Maps : హైదరాబాద్ టూరిస్టులు కేరళలో గూగుల్ మ్యాప్స్ సహాయంతో కారు ప్రయాణాన్ని కొనసాగించగా.. కారు నీటి ప్రవాహంలోకి దూసుకెళ్లింది. హైదరాబాద్ కు చెందిన నలుగురు సభ్యులు గల బృందం విహారయాత్ర కోసం కేరళ వెళ్లింది. గూగుల్ మ్యాప్స్ ఆధారంగా కేరళలోని వివిధ ప్రాంతాలను సందర్శించారు. ఈరోజు తెల్లవారు జామున వారు కుమరకోమ్ నుంచి అలప్పుజకు బయల్దేరారు. గూగుల్ మ్యాప్స్ ఆన్ చేసి ప్రయాణాన్ని ప్రారంభించారు. అయితే కొట్టాయం జిల్లాలోని కురుప్పాంతరా ప్రాంతానికి చేరుకోగానే వారు ప్రయాణిస్తున్న కారు వాగులోకి దూసుకెళ్లింది. కేరళలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురువగా.. భారీగా వరదనీరు రహదారులపై చేరింది. అది గమనించని పర్యాటకుల కారు.. రహదారిపై వెళుతూ వాగులోకి దూసుకెళ్లింది.
స్థానికులు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న పోలీసులు మహిళతో పాటు ముగ్గురు ప్రయాణికులను కాపాడి ఒడ్డుకు చేర్చారు. అయితే వారి కారు మాత్రం పూర్తిగా నీటిలో మునిగిపోయింది. కారును బయటకు తీసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని పోలీసులు తెలిపారు.
కేరళలో ఇలాంటి ఘటన జరగడం ఇదే ప్రథమం కాదు. గత ఏడాది అక్టోబరులో ఇద్దరు యువ డాక్టర్లు కారులో గూగుల్ మ్యాప్ ఉపయోగించి నదిలోకి దూసుకెళ్లారు. ఈ ప్రమాదంలో వారిరువురూ మృతిచెందారు.