Ayodhya:అయోధ్య రామమందిరం ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్ అయింది. జనవరి 22వ తేదీన ప్రధాన నరేంద్రమోదీ ఆలయాన్ని ప్రారంభించనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రముఖులకు, రాజకీయ నేతలకు, ఇండస్ట్రియలిస్ట్‌లకు ఆహ్వానాలు అందాయి. రామమందిరంలో శ్రీరాముని విగ్రప్రతిష్ట కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. దేశంలోని ప్రముఖ శిల్పకారులు ఈ ఆలయం కోసం అహర్నిశలు శ్రమించి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా మలుస్తున్నారు. ఇక ప్రారంభోత్సవానికి హజరయ్యే లక్షలాది భక్తుల కోసం భారీ స్థాయిలో ఆలయ ట్రస్ట్ ఏర్పాట్లు చేస్తోంది.
భక్తులు కూడా ఇప్పటి నుంచే ఆయోధ్య చేరుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటూ ఆ అద్వితీయ క్షణాల కోసం ఎదురు చూస్తున్నారు. రాములోరిని చూడటానికి భక్తులు తండోపతండాలుగా అయోధ్యకు చేరుకుంటున్నారు. వీవీఐపీల రాక కోసం పోలీసు శాఖ ఇప్పటికే ఏర్పాట్లని ముమ్మరం చేసింది. అనుమానాస్పదంగా కనిపించిన వారిని ఆలయ పరిసరాల్లోకి అనుమతించడం లేదు. ఇదిలా ఉంటే అయోధ్య రామమందిరానికి ఉపయోగించే తలుపులను హైదరాబాద్‌లోనే తయారు చేయించడం విశేషం.
హైదరాబాద్ న్యూ బోయిన్‌పల్లిలోని అనురాధ టింబర్ డిపోలో ఈ తలుపులు తయారు చేయించారు. గత ఏడాది జూన్ నుంచి తలుపుల తయారీ పనులు ప్రారంభం అయ్యాయి. అప్పటి నుంచి ఇక్కడే ఉండి తమిళనాడుకు చెందిన కుమారస్వామితో పాటు దాదాపు అరవై మంది కళాకారులు ఈ తలుపులను తయారు చేశారు. తలుపుల తయారీకి బల్లార్షా టేకును ఉపయోగించారని అనురాధ టింబర్ డిపో నిర్వాహాకలు తెలిపారు.
టింబర్ డిపో యజమాని చదలవాడ శరత్ బాబు మాట్లాడుతూ `తమకు ఈ అవకాశం లభించడం అదృష్టమని తెలిపారు. తలుపుల తయారీలో నాణ్యమైన కలపను ఉపయోగించామని ఆయన తెలిపారు. శిల్పకళా నైపుణ్యంతో అనేక మంది కళాకారులు ఈ తలుపుల తయారీలో పాల్గొన్నారని, ఈ తలుపులు చూసి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రశంసలు కురిపించారన్నారు. అయోధ్య రామమందిరం నిర్మాణానికి హైదరాబాద్‌లో తలుపులు తయారు చేయించడం గర్వంగా ఉందని టింబర్ డిపోలో పనిచేస్తున్న కార్మికులు తెలిపారు.