College Rules : కళాశాల ఆవరణలో ఇటీవల విద్యార్థులు హిజాబ్ ధారణను నిషేధించి వార్తల్లో నిలిచిన చెంబూర్ ట్రాంబే ఎడ్యుకేషనల్ సొసైటీ, తాజాగా టీషర్టులు, చెరిగిన జీన్స్ పైనా నిషేధం విధించింది. తమ కాలేజీకి వచ్చే విద్యార్థులు సాంస్కృతిక అసమానతల్ని సూచించే దుస్తులతో రావొద్దని ఆదేశించింది. ముంబైలో ఈ సొసైటీ నిర్వహిస్తూన్న ఎన్జీ ఆచార్య, డీకే మరాఠే కాలేజీల్లో చిరిగిన జీన్స్, టీషర్టులు, జెర్సీలతో వస్తే అనుమతించబోమని, ఫార్మల్, డీసెంట్ దుస్తులతో పాటు హాఫ్ లేదా ఫేల్ షర్టు, ప్యాంటు ధరించవచ్చని సూచించింది. బాలికలు భారతీయ లేదా పాశ్చాత్య దుస్తులు ధరించినా అభ్యంతరం లేదని పేర్కొంటూ జూన్ 27న నోటీసు జారీ చేసింది.
గత నెలలో కళాశాల ప్రాంగణంలో హిజాబ్, బుర్ఖా, నకాబ్, టోపీలపై నిషేధించడాన్ని పలువురు విద్యార్థులు బాంబే హైకోర్టులో సవాల్ చేసిన విషయం తెలిసిందే. విద్యాసంస్థల్లో హిజాబ్ నిషేధం సబబేనని హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఏకరూప వస్త్రధారణ దృష్ట్యా విద్యార్థులు హిజాబ్, బుర్ఖా, నకాబ్, టోపీలను ధరించకుండా నిషేధం విధించవచ్చని స్పష్టం చేసింది. క్రమశిక్షణలో భాగంగానే డ్రెస్ కోడ్ ఉంటుందని పేర్కొంటూ కాలేజీ యాజమాన్యం నిర్ణయాన్ని సమర్థించింది.