Young Players : ఐపీఎల్ లో కోట్లు కుమ్మరించి కొనుక్కున్న ప్లేయర్స్ తేలిపోతుంటే. రూ. 20 లక్షల బేస్ ప్రైజ్ కు అమ్ముడుపోయిన యువ క్రికెటర్లు దుమ్మురేపుతున్నారు. ఈ ఐపీఎల్ సీజన్ లో సగం మ్యాచ్ లు అయిపోయాయి. ఇప్పటి వరకు కుర్రాళ్లు కుమ్మేశారు. శశాంక్ సింగ్, అశుతోష్ శర్మ చివర్లో వచ్చి పంజాబ్ కు గుజరాత్ పై సంచలన విజయం సాధించి పెట్టారు. సన్ రైజర్స్ మీద గెలిపించినంత పని చేశారు.
సన్ రైజర్స్ తో పోరులో టాప్ ఆర్డర్ విఫలమైన చివరి బంతి వరకు పోరాడి క్రికెట్ అభిమానుల మనసు గెలుచుకున్నారు. అశుతోష్ మధ్యప్రదేశ్ కు చెందిన ఆటగాడు.. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో కేవలం 11 బంతుల్లోనే అర్ధ సెంచరీ చేసి యువరాజ్ సింగ్ 12 బంతుల్లో అర్ధ సెంచరీ రికార్డును చెరిపేశాడు. అంతలా విధ్వసం చేయగలడు. అశుతోష్ కు ఈ ఐపీఎల్ సీజన్ మొదటిది. శశాంక్ సింగ్ కూడా సాధికారిక ఇన్సింగ్స్ లు ఆడుతూ.. జట్టుకు భారమైన విదేశీ ప్లేయర్ల లోటును తన ఆటతీరుతోతీర్చుతున్నాడు. ఈ ప్లేయర్ ను అనుకోకుండా కొన్న పంజాబ్ చేసిన తప్పే వారికి ఇప్పడు మంచి చేస్తుంది.
రాజస్థాన్ రాయల్స్ తరఫున రియాన్ పరాగ్ ఆరెంజ్ క్యాప్ వేటలో ఉన్నాడు. విరాట్ కొహ్లి తర్వాత సిరీస్ లో ఎక్కువ పరుగులు చేసింది రియాన్ పరాగే. బ్యాటింగ్ లో నాలుగో స్థానంలో దిగుతున్న అస్సాం కుర్రాడు. 7 మ్యాచుల్లో 318 పరుగులు చేశాడు. నాలుగు సీజన్లలో కలిపి కేవలం 600 పరుగులు చేస్తే కేవలం ఈ సీజన్ లో ఏడు మ్యాచ్ ల్లోనే 318 పరుగులు చేసి టీం ఇండియా తలుపు తట్టేందుకు సిద్ధంగా ఉన్నాడు.
మరో వైపు సన్ రైజర్స్ తరఫున నితీశ్ కుమార్ రెడ్డి పంజాబ్ తో మ్యాచ్ లో టాఫ్ ఆర్డర్ విఫలమైనా 64 పరుగులు కేవలం 35 బంతుల్లోనే చేసి ఔరా అనిపించుకున్నాడు. నితీశ్ మీడియం పేస్ బౌలింగ్ కూడా చేయగలడు. రాబోయే రోజుల్లో ఆల్ రౌండర్ కొరత తీరినట్లేనని అనుకుంటున్నారు. అభిషేక్ శర్మ తన దూకుడైన బ్యాటింగ్ తో సన్ రైజర్స్ కు మంచి ఆరంభాన్నిస్తున్నారు. ఇలా కుర్రాళ్లు కుమ్ముస్తుంటే కోట్లు పెట్టిన వారు ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోతున్నారు.