Sajjala : ఆ రోజు రూల్స్ అంటూ కూర్చొవద్దు.. ప్రత్యర్థులను అడ్డుకోవాలన్న సజ్జల
Sajjala : ఏపీలో ఎన్నికలు పూర్తయ్యాయి. సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం ఎన్నికల సంఘం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. దాంతో పాటు అన్ని రాజకీయ పార్టీలు జూన్ 4న జరిగే కౌంటింగ్ కోసం తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. అయితే పోల్ మేనేజ్ మెంట్ తరహాలోనే.. కౌంటింగ్ డే మేనేజ్ మెంట్ కూడా చేయగలిగితేనే ఎన్నికల్లో తమకు గెలుపు సాధ్యమని పార్టీలు భావిస్తున్నాయి. ఈ క్రమంలో తమ పార్టీలకు చెందిన ఏజెంట్లకు శిక్షణ నిర్వహిస్తున్నాయి. అందులోనూ అధికార పార్టీ అయిన వైఎస్సార్ సీపీ.. తమ ఏజెంట్లకు చేసిన సూచన ప్రస్తుతం ప్రాధాన్యం సంతరించుకుంది. కౌంటింగ్ రోజు వైసీపీ వ్యూహం ఎలా ఉండాలన్న దానిపై కౌంటింగ్ ఏజెంట్లకు పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తరగతులు నిర్వహించారు. ఇందులో ఆయన.. కౌంటింగ్ రోజు ఏజెంట్లు ఏం చేయాలో చెప్పారు. రూల్స్ పేరుతో ఏ ఒక్క ఓటునూ వదల వద్దని వారికి కీలక సూచన చేశారు. వైసీపీ టార్గెట్ ఏంటో తెలుసుకుని కౌంటింగ్ రోజు జాగ్రత్తగా పని చేయాలన్నారు. ముందుగా రూల్స్ తెలుసుకుని ప్రత్యర్థి పార్టీలకు చెందిన వారిని ఎలా అడ్డుకోవాలో చూడాలన్నారు.
నియమ నిబంధనలు అంటూ మడికట్టుకుని కూర్చోవద్దని వైసీపీ కౌంటింగ్ ఏజెంట్లకు సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు. అవసరమైతే రూల్స్ దాటి అయినా పనిచేయాలని ఏంజెట్లకు ఆయన హింట్ ఇచ్చారు. రూల్స్ ను తమకు అనుకూలంగా మార్చుకుని, ప్రత్యర్థులకు ఆ ఎలాంటి ఛాన్స్ ఇవ్వకుండా చేయడానికి ఏం చేయాలో అన్నీ చేయాలంటూ సజ్జల సూచించారు. ప్రతీ కౌంటింగ్ ఏజెంట్ ఏం చేయాలో వారి మెదళ్లలోకి ఎక్కించాలన్నారు. అలాగే పొరబాటున ఓ విషయంలో మనం వాదించినా పర్లేదు.. కానీ రూల్స్ కు కట్టుబడి ఉంటామనే వారు అయితే కౌంటింగ్ ఏజెంట్లుగా వద్దని సజ్జల తేల్చి చెప్పేశారు. మన ప్రత్యర్థి ధర్మ యుద్ధం చేయడం లేదని, కాబట్టి వారి ఆటలు కొనసాగకుండా ఏం చేయాలన్న దానిపైనే మన ఏజెంట్లు దృష్టి కేంద్రీకరించాలన్నారు.