AP Elections : గతంలో జరిగిన పొరపాట్లు మళ్లీ చేయొద్దు.. ఆ పార్టీ ఈ విషయం గుర్తుంచుకోవాలి..

AP Elections

AP Elections

AP Elections :  ఏపీలో మరో వారం రోజుల్లో ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో అన్ని రాజకీయ పార్టీలు ప్రచారం ముమ్మరం చేశాయి. ఈ ఎన్నికల్లో ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని ప్రతిపక్షాలు తహతహలాడుతున్నాయి. వైసీపీని గద్దె దించాలని ఉన్న శక్తినంతా కూడగడుతున్నాయి. ఈ క్రమంలోనే 2014లో కూటమిగా మారిన టీడీపీ, బీజేపీ, జనసేనలు మరో సారి చేతులు కలిపాయి. అయితే ఈ కూటమిలో పైకి బాగానే ఉన్నప్పటికీ లోలోపల మాత్రం బీజేపీ ఎందుకో అంతగా యాక్టివ్ గా లేనట్టు కనిపిస్తోంది. 2014లో ఏకతాటిపై ఉండి కూటమి విజయం సాధించింది. కానీ 2019 నాటికి సీన్ మారింది. మూడు పార్టీలూ తమ దారులు వెతుక్కున్నాయి. దాంతో వైసీపీ లాభపడింది. భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు మళ్లీ మూడు పార్టీలు జతకట్టినా, 2019లో చేసిన పొరపాట్లు ఇప్పుడు  చేయవద్దని సగటు పౌరుడు కోరుకుంటున్నాడు.

అప్పట్లో అటు పవన్ కళ్యాణ్, ఇటు చంద్రబాబు.. ఇద్దరూ బీజేపీపై ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు. రెండు లడ్డూలు ఇచ్చారంటూ పవన్ కళ్యాణ్.. ఈ దేశంలో ఉండేందుకు మోడీ అర్హుడు కాదని చంద్రబాబు.. ప్రధాని మోడీని టార్గెట్ చేశారు. కానీ తర్వాత ఆ పార్టీ అవసరం అనివార్యం అయింది. దీంతో అనతికాలంలోనే పవన్ కళ్యాణ్ మారిపోయి.. మోడీకి సపోర్టర్ గా మారిపోయారు. అటు మోడీ కూడా పవన్ క్రేజ్ చూసి.. ఎన్డీయేలోకి జనసేనను ఆహ్వానించారు.  కానీ కమలం పెద్దలకు మాత్రం ఈ పొత్తు ఇష్టం లేదన్న ప్రచారం జరుగుతోంది. పవన్ కోసం ఈ పొత్తుకు సిద్ధపడ్డారే తప్ప.. టీడీపీ పై బీజేపీ పెద్దలకు మాత్రం ఆసక్తి లేదని తెలుస్తోంది.

ఇటీవల చిలకలూరిపేటలో కూటమి ఏర్పాటు చేసిన సభకు వచ్చిన మోడీ.. చంద్రబాబును మెచ్చుకోలేదు. అలాగే సీఎం జగన్‌పై ఎలాంటి విమర్శలూ చెయ్యలేదు. చంద్రబాబు మాత్రం మోడీని ఆకాశానికి ఎత్తేశారు. ఇటీవల మేనిఫెస్టో విడుదల సమయంలో కూడా బీజేపీ దూరంగా ఉంది. రీసెంట్ గా ధర్మవరంలో జరిగిన సభలో కూడా.. చంద్రబాబుతో చేయి కలిపేందుకు అమిత్ షా ఆసక్తి చూపలేదు. తన ప్రసంగం తర్వాత చంద్రబాబు మాట్లాడకముందే అమిత్ షా వెళ్లిపోయారు. దీంతో టీడీపీతో బీజేపీ పైకి మాత్రమే ఒక్కటైనట్లు ఉందని కానీ.. నిజమైన బంధం కాదనే వాదన వినిపిస్తోంది.

అయితే రాష్ట్రంలో బీజేపీకి ఓటు బ్యాంకు చాలా స్వల్పం. అయినా కూడా టీడీపీ త్యాగం చేసి మరీ సీట్లు ఇచ్చింది. ఈ విషయాన్ని బీజేపీ కేంద్ర పెద్దలు గుర్తెరగాలి. రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్న వైసీపీ మరోసారి అధికారంలోకి రాకూడదనే ఏకైక ఉద్దేశంతోనే బీజేపీతో టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకున్నాయి. మరో వారం రోజుల్లోనే ఎన్నికలు జరుగబోతున్నాయి. ఇలాంటప్పుడు బీజేపీ కూటమిలో చురుకుగా ఉండడమే కాదు జగన్ రెడ్డి సర్కార్ ను గద్దె దించేందుకు దూకుడుగా పనిచేయాల్సిన అవసరం ఉందని అంటున్నారు.

TAGS