America : ‘‘మా అంతర్గత విషయాల్లో జోక్యం వద్దు’’..కేజ్రీవాల్ అరెస్ట్ పై వ్యాఖ్యలు చేసిన  అమెరికా దౌత్యవేత్తకు సమన్లు..

American Diplomat

America

American Diplomat : భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశం. ఎన్నో పేద దేశాలకు సాయం అందించడమే కాదు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ తోడ్పాటు ఎంతో ఉంది. ప్రజాస్వామ్య పరిరక్షణకు భారత్ చేస్తున్న కృషి ఎవరూ ప్రశ్నించలేనిది. కానీ ఇటీవల కాలంలో కొన్ని దేశాలు భారత్ లో ప్రజాస్వామ్యంపై పలు వ్యాఖ్యలు చేస్తున్నాయి. వాటికి భారత నేతలు గట్టిగానే సమాధానం చెప్తూనే ఉన్నారు. భారత్ ను ఎవరూ ప్రశ్నించలేరని, ప్రజాస్వామ్య పరిరక్షణలో భారత్ పాత్ర ఎంటో ప్రపంచానికి తెలుసు అని భారత ప్రభుత్వం వారిని హెచ్చరిస్తోంది.

కేజ్రీవాల్ అరెస్ట్ ను ఉద్దేశిస్తూ వ్యాఖ్యలు చేసిన అమెరికా దౌత్యవేత్తకు భారత్ సమన్లు జారీ చేసింది. ఈమేరకు అమెరికా దౌత్యవేత్తకు భారత విదేశాంగ శాఖ ఈ నోటిసులు పంపింది. కేజ్రీవాల్ అరెస్ట్ కు సంబంధించిన పరిణామాల్ని పరిశీలిస్తున్నామని గ్లోరియా బెర్బెనా చేసిన కామెంట్లపై భారత్ అసహనం వ్యక్తం చేసింది. భారత్ లోని లీగల్ ప్రొసీడింగ్స్ గురించి ఇలా మాట్లాడడం సరికాదని మందలించింది. అలాగే మాల్దీవులు, కెనడా విషయంలోనూ భారత్ వైఖరిపై మాట్లాడడం గమనార్హం.

‘‘పరస్పరం సహకరించుకోవడం, ఒకరిని ఒకరు గౌరవించుకోవడం దౌత్యంలో చాలా కీలకమైన విషయం. అంతర్గత విషయాలనూ గౌరవించాలి. ప్రజాస్వామ్య దేశాల్లో ఇది మరింత ముఖ్యమైన అంశం. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల సానుకూల వాతావరణం దెబ్బతింటుంది. భారత్ లో స్వతంత్ర న్యాయవ్యవస్థ ఆధారంగానే లీగల్ ప్రొసీడింగ్స్ జరుగుతాయి. సరైన సమయానికి అవి చర్యలు తీసుకుంటాయి’’ అని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది.

ఈ క్రమంలోనే గ్లోరియాతో భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ 40 నిమిషాల పాటు ప్రత్యేకంగా సమావేశమైంది. ఆమెకు సమన్లు జారీ చేసిన నేపథ్యంలో ఈ భేటీ జరగడం కీలకంగా మారింది. మార్చి 26వ తేదీన గ్లోరియా కేజ్రీవాల్ అరెస్ట్ పై మాట్లాడారు. చట్టపరమైన విచారణ పారదర్శకంగా, సరైన విధంగా జరగాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఇదే భారత్ కు అసహనం కలిగించింది. ఇటీవలే జర్మనీ కూడా కేజ్రీవాల్ అరెస్ట్ పై ఇలాంటి వ్యాఖ్యలే చేసింది. దీనిపైనా భారత్ అసహనం వ్యక్తం చేసింది. అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని మందలించింది. తమది ప్రజాస్వామ్య దేశమని,  చట్టపరంగా ఏం జరుగాలో అదే జరుగుతుందని స్పష్టం చేసింది. జర్మన్ తీరుని వ్యతిరేకిస్తూ ఓ ప్రకటన చేసింది. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మానేయాలని మందలించింది.

TAGS