Srivari Laddu Prasadam : శ్రీవారి ఆలయంలో జరిగిన దోషాలకు ప్రాయశ్చిత్తంగా శాంతి హోమం చేసినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. లడ్డూ ప్రసాదంపై ఇకపై ఎలాంటి అనుమానాలు వద్దని స్పష్టం చేశారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం విషయంలో ఇకపై ఎలాంటి అనుమానాలు వద్దని టీటీడీ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు తెలిపారు. ఇటీవల జరిగిన దోషాలు తొలగిపోవాలని శాంతి హోమం చేశామని పేర్కొన్నారు. పవిత్రోత్సవాల ముందు జరిగిన దోషం, పవిత్రోత్సవాలతో పోయిందని అన్నారు. మార్చిన నెయ్యితోనే ప్రసాదాలు తయారు చేశామని చెప్పారు.
శ్రీవారి లడ్డూ ప్రసాదంలో వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వులు కలిశాయనే వార్తలు ఇటీవల పెద్ద దుమారం రేపాయి. ఈ క్రమంలో జరిగిన మహా పాపానికి పరిహారంగా తిరుమల శ్రీవారి ఆలయంలో శాంతి హోమం, పంచగవ్య ప్రోక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధానార్చకులు వేణుగోపాల దీక్షితులు మాట్లాడుతూ ఆలయంలోని అన్ని విభాగాల్లో ప్రోక్షణ కార్యక్రమాలు చేశామని తెలిపారు. ప్రసాదాల తయారీ కేంద్రాల్లోనూ ప్రోక్షణ చేస్తున్నామని అన్నారు. తెలిసీ తెలియక జరిగిన దోషాలు శాంతి హోమం, ప్రోక్షణతో తొలగుతాయని అన్నారు. చివరగా పూర్ణాహుతి కార్యక్రమంతో అన్ని దోషాలు తొలగిపోతాయని చెప్పారు.