Nitin Gadkari : రోడ్లు సరిగా లేకుంటే హైవే ఏజెన్సీలు టోల్ వసూలు చేయవద్దని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సూచించారు. టోల్ ఛార్జీల వసూళ్లపై స్పందించిన నితిన్ గడ్కరీ ఈ వ్యాఖ్యలు చేశారు. వాహనదారులకు సరైన రోడ్డు సౌకర్యాలు కల్పించకుండా.. వారి నుంచి టోల్ ఛార్జీలు వసూలు చేయడం సమంజసం కాదని పేర్కొన్నారు. శాటిలైట్ ఆధారిత టోల్ వసూలుపై నిర్వహించిన గ్లోబల్ వర్క్ షాప్ లో పాల్గొన్న నితిన్ గడ్కరీ టోల్ ఛార్జీలు, టోల్ ఏజెన్సీలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా గుంతలు పడిన రోడ్లు, టోల్ ప్లాజాల వద్ద వాహనాల రద్దీ ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు.
సరిగా లేని రోడ్లపై టోల్ వసూలు చేస్తే ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తారని నితిన్ గడ్కరీ చెప్పారు. వాహనదారులకు మంచి సేవలు, సౌకర్యాలు అందించలేనప్పుడు వారి నుంచి టోల్ ఛార్జీలు కూడా వసూలు చేయవద్దని పేర్కొన్నారు. రోడ్లు బాగా లేకపోతే ప్రజలు సంతృప్తి చెందరని, ఇలా రోడ్లకు సంబంధించి చాలామంది సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని తెలిపారు. మంచి రోడ్లు అందించలేనప్పుడు టోల్ కూడా వసూలు చేయకూడదని టోల్ సంస్థలకు సూచించారు. ఈ సందర్భంగా టోల్ ప్లాజాల వద్ద భారీగా వాహనాలు వేచి ఉండటం, రద్దీ ఏర్పడటం పైనా నితిన్ గడ్కరీ స్పందించారు. వాహనదారులకు ఆలస్యం కాకుండా, వీలైనంత త్వరగా టోల్ గేట్ల వద్ద వాహనాలను క్లియర్ చేయాలని నేషనల్ హైవే ఫీల్డ్ ఆఫీసర్లకు సూచించారు.