Counter to BJP : హైదరాబాద్ పట్టణంలో మళ్లీ గాడిద గుడ్డు పోస్టర్లు వెలిశాయి. పట్టణ వ్యాప్తంగా బస్టాపులు, జంక్షన్ల దగ్గర ఈ పోస్టర్లు దర్శనమిస్తున్నాయి. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ అనేపదమే ప్రస్తావించలేదు, తెలంగాణ రాష్ట్రానికి నయాపైసా ఇవ్వలేదంటూ అధికార కాంగ్రెస్ పార్టీ దుమ్మెత్తిపోస్తోంది. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్రం నుంచి ఎనిమిది మంది బీజేపీ ఎంపీలను గెలిపిస్తే.. వాళ్లు సాధించింది, తెచ్చింది ఏంటో తెలుసా.. గాడిద గుడ్డు అంటూ బీజేపీకి చురకలు అంటిస్తూ హైదరాబాద్ సిటీ వ్యాప్తంగా పోస్టర్లు వెలిశాయి.
పార్టమెంటు ఎన్నికల సమయంలో తెలంగాణకు పదేండ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ ఏమీ చేయలేదని, గాడిద గుడ్డని కాంగ్రెస్ ప్రచారం చేసింది. మళ్లీ నిన్న పార్లమెంట్ బడ్జెట్ లో తెలంగాణకు మోదీ సర్కార్ ఏమీ ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న తరుణంలో మరోసారి గాడిద గుడ్డు పోస్టర్లు వెలిశాయి.