Dokka Manikya Varaprasad : ఎన్నికల వేళ కీలక రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీ, ప్రతిపక్ష కూటమి మధ్య ప్రతిష్ఠాత్మక పోరు కొనసాగుతోంది. మాజీమంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ వైసీపీకి రాజీనామా చేశారు. గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్ష పదవి, క్రియాశీలక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ మేరకు రాజీనామా లేఖను జగన్ కు పంపించినట్లు తెలిపారు.
వైసీపీ నుంచి తాడికొండ టికెట్ ఆశించిన ఆయనకు నిరాశ ఎదురుకావడంతో కొన్ని రోజులుగా అధిష్ఠానంపై అసంతృప్తితో ఉన్నారు. డొక్కా కాంగ్రెస్ నుంచి రెండు సార్లు తాడికొండ ఎమ్మెల్యేగా పనిచేశారు. మంత్రిగానూ వ్యవహరించారు. ఆ తరువాత టీడీపీ నుంచి ప్రత్తిపాడు అసెంబ్లీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. వైసీపీ చేరిన డొక్కాకు జగన్ ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. ఈసారి ఎన్నికల్లో డొక్కా ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావించారు. తాడికొండ లేదా ప్రత్తిపాడు నుంచి సీటు ఇస్తారని ఆశించినా సీటు దక్కలేదు. జగన్ బస్సుయాత్ర సభలో పాల్గొన్న డొక్కా మాణిక్య వరప్రసాద్ పార్టీ తరపున ప్రచారంలో మాత్రం దూరంగానే ఉన్నారు.