JAISW News Telugu

YS Sharmila : వైఎస్ షర్మిల ఎవరు వదిలిన బాణమో అర్థమైనట్టేనా..?

YS Sharmila

YS Sharmila

YS Sharmila : వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ఎవరు వదిలిన బాణం..? ఇన్నిరోజులూ అటు ఆంధ్రప్రదేశ్‌లో.. ఇటు తెలంగాణలో మిలియన్ డాలర్‌గా మిగిలిపోయిన ప్రశ్న. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు వరకూ కూడా బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు, బీజేపీ పెద్దలు వదిలిన బాణం అని టాక్ నడిచింది. ఆ తర్వాత ఏపీ సీఎం వైఎస్ జగన్ వదిలిన బాణం కుప్పలు తెప్పలుగా వార్తలొచ్చాయి. తీరా ఎన్నికలకు ముందు అందరూ అనుకున్నట్లుగా బీఆర్ఎస్, బీజేపీకి దూరంగా.. కాంగ్రెస్‌కు దగ్గరగా కావడంతో అసలు ఏం జరుగుతోందో అర్థం కాని పరిస్థితి. వైఎస్ మరణాంతరం కాంగ్రెస్‌తో విబేధించి బయటికొచ్చిన పార్టీతోనే ఆఖరికి కలవాల్సిన పరిస్థితి. సీన్ కట్ చేస్తే ఒకటి రెండ్రోజుల్లో ఏకంగా వైఎస్సార్టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. కాంగ్రెస్ హైకమాండ్ నుంచి పిలుపు వచ్చిందని.. ఢిల్లీ వెళ్తున్నట్లు ఇడుపులపాయ వేదికగా షర్మిలనే ప్రకటించారు.

అవునా.. అన్నే వదిలారా..?
ఇక అన్న జగన్ వదిలిన బాణమైతే.. ఇన్నిరోజులూ ఇద్దరూ కలిసి చేసిందేమైనా ఉందా..? అంటే అబ్బే అస్సలే లేదు. పోనీ.. తెలంగాణలో పోటీ చేశారా అంటే అదీ లేదు. అన్నా చెల్లి మధ్య నెలకొన్నవి చిన్న చిన్నపాటి మనస్పర్థలు మాత్రమే. ఆస్తి వాటాలు, రాజకీయంగా ఎలాంటి ప్రోత్సాహం లేకపోవడంతోనే షర్మిల వేరు కుంపటి పెట్టారన్నది వైఎస్ ఫ్యామిలీకి దగ్గరి వ్యక్తులు చెబుతున్న మాటలు. ఆ మధ్య.. ‘నువ్వే కాదు.. నేను రాజకీయంగా ఎదిగి సీఎంను కాగలను’ అని పంథానికి వెళ్లి జగన్‌తో గొడవ పడ్డారనే టాక్ కూడా నడిచింది. అయితే ఆ దిశగా అడుగులు పడలేదు. కనీసం పార్టీ అధినేత్రి కూడా పోటీచేసిన దాఖలాల్లేవ్. ఇప్పుడు పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన తర్వాత ఏపీ పార్టీ పగ్గాలు అప్పగించడంతో పాటు.. కడప పార్లమెంట్ నుంచి ఎంపీగా బరిలోకి దింపాలన్నది హైకమాండ్ యోచనట. ఒకవేళ ఇదే నిజమైతే.. అందరూ అనుకున్నట్లుగా జగన్ వదిలిన బాణం రివర్స్ అవుతుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదేమో.!

అర్థమైందా రాజా!
తెలంగాణలో చెల్లి.. ఏపీలో అన్న రాజ్యమేలాలని జగన్ బాణం వదిలాడే అనుకుందాం.. ఒకవేళ అదే నిజమైతే ఇప్పుడు ఏం జరుగుతోంది..? అన్నది కాస్త నిశితంగా గమనిస్తే.. అస్సలు షర్మిల ఎవరు వదిలిన బాణం కాదన్నది క్లారిటీగా అర్థమైపోయింది. కేవలం రాజకీయంగా ఎదిగి.. వైఎస్సార్ సుపరిపాలనను జనాలకు చెప్పి ఏదో ఒక రకంగా పాలిటిక్స్‌లో రాణించాలనే తాపత్రయం తప్పితే.. ఏమీ లేదన్నది రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట. ఏపీకి పక్కాగా వెళితే.. అప్పుడు జగన్ పరిస్థితేంటన్నది ప్రశ్నార్థకమేనని.. ఎందుకంటే ఒకరిద్దరు కాదు సుమారు 40 మంది కీలక నేతలు వైసీపీ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లే పరిస్థితి ఉందని వార్తలు గుప్పుమంటున్నాయ్. ఇప్పటికే వైసీపీ ముఖ్యనేత, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా తాను వైఎస్ షర్మిల వెంటేనని తేల్చి చెప్పేశారు. ఇలాంటి వారు ఇంకెంత మంది ఉన్నారో.. వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల్లోని అసంతృప్తులు ఇంకెంత మంది ఉన్నారో.. ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. మొత్తానికి చూస్తే.. షర్మిల ఏపీ రాజకీయాల్లో కీలక పాత్రే పోషించబోతున్నారన్నది మాత్రం అర్థమవుతోంది. చూశారుగా.. ఇప్పటికైనా అర్థమైందా షర్మిల ఎవరు వదిలిన బాణమన్నది..!

Exit mobile version