Number Plate : హైదరాబాద్ నగర పోలీసు కమిషనరేట్ పరిధిలో పోలీసులకు నంబర్ ప్లేట్ లేని వాహనం కనిపిస్తే చాలు.. పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఈ మధ్య కాలంలో పలు సెల్ ఫోన్ స్నాచింగ్ లు జరిగాయి. సుమారు 700 ఫోన్లు పోలీసులు స్వాధీనం చేసుకుని, బాధితులకు అప్పగించారు. స్నాచింగ్ లు అన్నీ నంబర్ ప్లేట్ లేని వాహనాల పైనే ఎక్కువగా జరిగినట్లు పోలీసులు గుర్తించారు.
దీంతో నగర పోలీస్ కమిషనర్ ఆదేశాలతో సంబంధిత డీఎస్పీ ఆధ్వర్యంలో సైఫాబాద్ పోలీసులు నంర్ ప్లేట్ లేని వాహనాలపై స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. ఒక్క రోజే 20కి పైగా వాహనాలను పట్టుకొని స్టేషన్ కు తరలించారు. నంబర్ ప్లేట్ బిగించుకున్న తర్వాతే వాటిని వదిలిపెట్టారు. నంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడుపుతున్న వారిలో యువకులే అధికంగా ఉన్నారు.
తల్లిదండ్రులు వారి పిల్లలను అప్రమత్తం చేయాలని తెలిపారు. చివరి అంకెలు కనిపించకుండా నంబర్ ప్లేట్ ను మడిచిపెట్టినా, కనిపించకుండా చేసినా చర్యలు తప్పవని ఎస్సై పి.రాఘవేందర్ హెచ్చరించారు. హైదరాబాద్ పట్టణంలోని అన్ని పోలీస్ స్టేషన్లలో స్పెషల్ డ్రైవ్ కొనసాగుతుందని పోలీసులు చెపుతున్నారు.