Indiramma House : ఈ అర్హత ఉందా? అయితే ఇందిరమ్మ ఇల్లు మీ సొంతం.. గైడ్ లైన్స్ ఇవే..
Indiramma House : కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి సంక్షేమ పథకాలను పరుగులు పెట్టిస్తున్నాడు సీఎం రేవంత్ రెడ్డి. ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీలను వెంట వెంటనే అమలు చేస్తూ.. మేనిఫేస్టోలో ఇచ్చిన హామీలను కూడా నెరవేరుస్తున్నాడు. దీంతో పేదల నుంచి మెప్పు పొందుతున్నాడు.
బీపీఎల్ కుటుంబాలకు అండగా నిలుస్తాం అని చెప్తున్న రేవంత్ ప్రభుత్వం.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా నెరవేరుస్తోంది. అధికారంలోకి వచ్చిన వెంటనే ‘మహాలక్ష్మి’ పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడంతో పాటు ఆరోగ్య శ్రీ లిమిట్ రూ. 10 లక్షలకు పెంచింది.
ప్రజా పాలన, అభయ హస్తం పేరుతో కార్యక్రమం నిర్వహించి వివిధ పథకాలకు అర్హుల కోసం దరఖాస్తులను తీసుకుంది. తమ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు పూర్తి చేయాలని కంకణం కట్టుకొని ముందుకెళ్తున్నారు సీఎం.
ఇటీవల ‘గృహజ్యోతి’ అమలు చేసి అర్హులైన కుటుంబాలకు 200 యూనిట్ల లోపు ఉచిత కరెంట్, రూ. 500 గ్యాస్ సిలిండర్ అందించారు. ఇదే బాటలో పేదలకు మరో వరం ఇచ్చారు. అధికారికంగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని కూడా ఇటీవల ప్రారంభించారు.
ఈ పథకం కింద ఇల్లు లేని పేదలకు.. ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం ఇస్తున్నారు. పథకం ఆరంభంలో ఇంటి నమూనా చూపించిన సీఎం.. అర్హత ఏంటి..? ఎవరెవరికి మంజూరు చేస్తారనేదానిపై గైడ్‌లైన్స్ వివరించారు.
ఈ ఇల్లు మహిళల పేరు మీదనే మంజూరవుతుంది. తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబాలు మాత్రమే అర్హులు. తొలి దశలో సొంత స్థలం ఉండి.. ఇల్లు లేనివారికి ఆర్థిక సాయం. లోకల్ వారై ఉండాలి. అద్దెకున్న వారు కూడా అర్హులు.
ఇందిరమ్మ ఇళ్లకు లబ్ధిదారుల ఎంపిక జిల్లా ఇన్‌చార్జి మంత్రి అధ్యక్షతన వస్తుంది. కలెక్టర్లు ఫైనల్ లిస్ట్ రెడీ చేస్తారు. జీపీ జనాభాకు అనుగుణంగా మంజూరు చేస్తారట. ఆ తర్వాత లబ్ధిదారుల లిస్టును గ్రామ సభలు, పట్టణాలు వార్డు మీటింగులలో ప్రవేశపెడతారు.
ఈ పథకంలో సొంత జాగా ఉన్నవారికి ఇల్లు నిర్మించుకోవడానికి రూ.5 లక్షలు ఇస్తారు. 4 దశల్లో ఆర్థిక సాయం అందుతుంది. బేస్ మెంట్ పూర్తయ్యాక రూ. లక్ష, స్లాబ్ లెవెల్ కు చేరాక మరో రూ. లక్ష, స్లాబ్ పూర్తయిన వెంటనే రూ. 2 లక్షలు, ఇల్లు పూర్తయిన తర్వాత చివరి లక్ష రిలీజ్ చేస్తారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ ఇళ్ల నిర్మాణంలో చేసిన తప్పులు జరగకుండా.. ఎక్కడా అవకతవకలకు తావియ్యకుండా అర్హులను ఎంపిక చేయాలని సీఎం చెబుతున్నారు. అర్హులైన ఏ ఒక్క పేద కుటుంబానికి అన్యాయం జరగద్దని, అన్ని పథకాలు పేదలకు అందేలా చూడాలని సీఎం ఆదేశాలు జారీ చేస్తున్నారు.