YCP : ఆ చెంపదెబ్బే వైసీపీని ముంచబోతుందా?
YCP : ఏపీలో ఎన్నికలు పూర్తయ్యాయి. అక్కడక్కడా చిన్న, చిన్న గొడవలు మినహా ప్రశాంతంగా పోలింగ్ ముగిసింది. సర్వేలన్నీ కూటమిదే అధికారమని తేల్చడం, పోలింగ్ శాతం పెరగడంతో వైసీపీ నేతలు అప్పుడే ఓటమికి కారణాలు వెతుక్కుంటున్నారు. కారణం ప్రభుత్వ వ్యతిరేకత కాదని, సొంత పార్టీ నేతలే వెన్నుపోటు పొడిచారని కొందరు ఆరోపిస్తున్నారు. ఇక గుంటూరు జిల్లా తెనాలిలో ఓ ఓటరు వైఎస్సార్‌సీపీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ చెంప చెళ్లుమనిపించారు. ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ క్యూలైన్లో నిలబడకుండా.. నేరుగా ఓటేసేందుకు పోలింగ్ బూత్‌లోకి వెళ్లడానికి ప్రయత్నించారు. వెంటనే గమనించి ఓ ఓటరు క్యూ లైన్లో నిల్చొని ఓటు వేయాలని అభ్యంతరం వ్యక్తం చేశారు.
దీంతో ఎమ్మెల్యే సంగతేంటో కానీ.. వైసీపీ పార్టీ పేరు మాత్రం మార్మోగిపోతుంది. దీంతో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన వెంటనే ఆ పార్టీకి ఈ ఘటన పెద్ద అపశకునంగా మారింది. గత ఐదేళ్లుగా సాగించిన పెత్తందారి పోకడలను ఎన్నికల సమయంలో పోలింగ్ బూత్ లోకి వెళ్లే సమయంలో చూపించడంతో ఆ పార్టీ ఎదురు చెంపదెప్ప తినాల్సి వచ్చింది. పోలింగ్ బూత్ లోకి నేరుగా తాను మాత్రమే కాకుండా.. ఆయనతో మరో నలుగుర్ని వెంటేసుకుని వెళ్లబోయారు.. అప్పటికే గంటల తరబడి చాలా పెద్ద క్యూల్లో ఉన్న ఓటర్లు అసహనం వ్యక్తం చేశారు. ఓ వ్యక్తి అలా ఎలా వెళ్తారంటూ ప్రశ్నించారు. దీంతో శివకుమార్ వెంటనే ఆ ఓటర్ పై దాడి చేశారు. ఆ ఓటర్ తిరిగి లాగి పెట్టి శివకుమార్ ను కొట్టాడు. ఆ తర్వాత శివకుమార్ అనుచరులు అతనిపై ఘోరంగా దాడి చేశారు. ఈ వ్యవహారంపై ఎన్నికల కమిషన్ స్పందించింది. శివకుమార్ ను గృహనిర్బంధంలో ఉంచాలంటూ ఆదేశాలు జారీ చేసింది.
ఈ ఘటన ముందు.. తర్వాత ఏం జరిగిందన్న సంగతిని పక్కన పెడితే .. ఎమ్మెల్యేను లాగి పెట్టి కొట్టిన ఓటర్ కొట్టిన వ్యవహారం మాత్రం .. వైసీపీకి తగిలిన దెబ్బగానే భావించవచ్చు. సింబాలిక్ గా ఉన్న వ్యవహారం ఒక్క సారిగా సోషల్ మీడియాలో వైరల్ అయింది. వైసీపీ అహంకారానికి ఓటర్లు జూన్ 4న ఎలాంటి ట్రీట్ మెంట్ ఇవ్వబోతున్నారో తెలిసేలా ఆ ఘటనను ఉదాహరణగా చెప్పవచ్చు.