Rajashyamala Yagam : ‘రాజశ్యామల’ తెచ్చేనా రాజయోగం..?

Rajashyamala Yagam

Rajashyamala Yagam

Rajashyamala Yagam : ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది రాజకీయ పార్టీలు, నేతల హడావిడి పెరిగిపోతోంది. సీటు ఖరారు అయిన అభ్యర్థులు నియోజకవర్గాల్లో ఇప్పటికే ప్రచారం చేసుకుంటున్నారు. ఇక అధికార, ప్రతిపక్ష పార్టీలు రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా సరే గెలవాలని వ్యూహాలు రచిస్తున్నాయి. ఏ చిన్న విషయాన్ని వదలకుండా పూర్తిస్థాయిలో సిద్ధం కావాలని భావిస్తున్నాయి.

ఇక ప్రతిపక్షనేత చంద్రబాబుకు రాబోయే ఎన్నికలు చాలా కీలకమనే చెప్పాలి. పార్టీ భవిష్యత్ , కుమారుడి భవిష్యత్  ఈ ఎన్నికలపైనే ఆధారపడి ఉంది. అందుకే చంద్రబాబు ఏ ఒక్క విషయాన్ని వదలేయడం లేదు. అన్ని విషయాల్లోనూ ఆచితూచి అడుగులు వేస్తున్నారు. అందుకే ఒంటరి పోరు చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి జగన్ రెడ్డికే గెలుపు చాన్స్ ఉంటుందని భావించి.. జనసేన,బీజేపీలతో కలిసి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. తమకు కొన్ని సీట్లు తగ్గినా సరే.. ఎన్నికల్లో గెలుపు కోసం సీట్ల త్యాగం చేస్తున్నారు. అలాగే సోషల్ మీడియా, సభలు, మ్యానిఫెస్టో..ఇలా ప్రతీ విషయాన్ని దగ్గరుండి చూసుకుంటున్నారు.

అయితే మానవుడిగా మనం ఎన్ని చేసినా విధిరాత, లక్ ఫ్యాక్టర్, దైవశక్తి అంటూ ఉంటాయి కాబట్టి.. వాటిని సైతం మేనేజ్ చేసేలా శుక్రవారం సతీసమేతంగా రాజశ్యామల యాగం చేపట్టారు. నేటి నుంచి మూడు రోజుల పాటు చంద్రబాబు ఈ యాగాన్ని చేయనున్నారు. మొదటి రోజు జరిగిన పూజా కార్యక్రమాలు, యాగ క్రతువులు చేశారు. 50 మంది రిత్వికులు యాగ నిర్వహణలో పాల్గొన్నారు. ఆదివారం పూర్ణాహుతితో యాగం ముగుస్తుంది. విజయం సిద్ధించేలా చేయమని శ్యామలాదేవిని అంటే అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి ఈ యాగం నిర్వహిస్తున్నారు.

ముఖ్యంగా రాజకీయాల్లో ఉన్న వారు అధికారం కోసం చేసే యాగమిది. గతంలో కేసీఆర్, జగన్ మోహన్ రెడ్డి, రేవంత్ రెడ్డి సైతం ఈ యాగం చేశారు. వారికి అధికారం తలుపుతట్టిన విషయం తెలిసిందే. ఈక్రమంలో మరోసారి అధికారం కోసం చంద్రబాబు ఈ యాగాన్ని నిర్వహిస్తున్నారు. రాజశ్యామల యాగాన్ని ఎన్నికలకు ముందు చేయడం ముఖ్యంగా ప్రత్యర్థులను బలహీనం చేయడానికేనని ఈ యాగం గురించి తెలిసిన పండితులు చెబుతున్నారు. ఏపీలో జగన్, చంద్రబాబు మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది కనుక.. జగన్ ను గద్దె దించాలనే సంకల్పంతో ఉన్న చంద్రబాబు ఈ యాగం చేస్తున్నారు. మరి చంద్రబాబు ఈ యాగఫలం ఎంతవరకు ప్రాప్తిస్తుందో మరో రెండు, మూడు నెలల్లో తెలియనుంది.

TAGS