JAISW News Telugu

Amaravati : అమరావతికి మంచి రోజులొచ్చినట్లేనా ?

Amaravati

Amaravati

Amaravati : ఏపీలో ఎన్నికల తంతు పూర్తయింది. వైసీపీ ఘోర పరాజయం పాలై.. టీడీపీ అత్యధిక మెజార్టీతో గెలిచింది. త్వరలో కూటమి ప్రభుత్వం కొలువుదీరనుంది. ఈ క్రమంలో అందరి దృష్టి ఇప్పుడు అమరావతి పైన పడింది. వైసీపీ పాలనలో అనేక నిర్బంధాలు, ఆంక్షలు, కేసులతో ఉక్కిరిబిక్కిరి అయిన రాజధాని రైతుల్లో ఎన్డీయే కూటమి గెలవడంతో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి.  మంగళవారం వారంతా వీధుల్లోకి వచ్చి సంబరాలు చేసుకున్నారు.  అమరావతి రూపశిల్పి చంద్రబాబు ముఖ్యమంత్రి కాబోతుండడంతో నినాదాలు చేస్తూ టపాసులు కాల్చుతూ స్వీట్లు పంచుకున్నారు. ‘జై అమరావతి’, ‘ఒకే రాష్ట్రం.. ఒకే రాజధాని’ అమరావతీ ఊపిరి పోసుకో..’ అంటూ నినదించారు. అమరావతి ఉద్యమ గీతాలకు నృత్యం చేస్తూ ఆకుపచ్చ, పసుపు కండువాలతో విధుల్లో కలియదిరిగారు. గత ఐదేళ్లుగా పడుతున్న బాధలు తొలిగాయని తమకు మంచి రోజులు వచ్చాయన్న ఆనందం రైతుల కళ్లలో కనిపించింది.

మంగళవారం ఉదయం నుంచే  తుళ్లూరు శిబిరంలో భారీ ఎల్‌ఈడీ తెర ఏర్పాటు చేసి రైతులు, మహిళలు ఫలితాలను ఉత్కంఠగా వీక్షించారు. ఫలితాల కోసం అందరూ టీవీలకు అతుక్కుపోయారు. రాజధాని రహదారులన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి. ఓట్ల లెక్కింపు ప్రారంభమైన తొలి రెండు రౌండ్లలోనే ఫలితం తెలిసిపోవడంతో టీడీపీ, బీజేపీ, జనసనే కూటమి  అభ్యర్థులు భారీ మెజారిటీ సాధిస్తుండడంతో ఒక్కసారిగా రోడ్లపైకి దూసుకొచ్చారు. అన్యాయం ఓడింది..  న్యాయం గెలిచింది, ధర్మం నిలిచింది. జై అమరావతి. జై చంద్రబాబు అంటూ నినదించారు.  స్థానిక ఆలయాల్లో రైతులు, రైతుకూలీలు, మహిళలు పూజలు చేశారు.

రాజధాని ప్రాంతం అయిన మందడం, వెలగపూడిలో మహిళలు పసుపు చీరలు ధరించి రోడ్లపైకి వచ్చారు. ఎన్టీఆర్‌ విగ్రహాలను నీళ్లతో శుద్ధి చేసి, తర్వాత పాలాభిషేకం నిర్వహించారు. జోహార్‌ ఎన్టీఆర్‌ అంటూ నినాదాలు చేశారు. వెలగపూడి శిబిరంలో అమరావతి గీతాలకు నృత్యాలు చేశారు. దొండపాడులో మహిళలు పెద్ద సంఖ్యలో శిబిరానికి చేరుకొని జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్, జై చంద్రబాబు అంటూ నినాదాలు చేశారు. తమ కష్టాలు తొలగిపోయాయంటూ మందడంలో మహిళలు పండుగ చేసుకున్నారు.  వడ్డమాను గ్రామంలో మహిళలు  
ఐనవోలు గ్రామంలో డీజేలతో కూటమి యువత హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ఉద్దండరాయునిపాలెంలో సైకిళ్లకు జెండాలు కట్టుకుని ర్యాలీగా గ్రామంలో తిరిగారు.  ఇది ఇలా ఉంటే రాజధాని గ్రామాల్లో రోడ్లపై గస్తీ తిరుగుతున్న తుళ్లూరు డీఎస్పీ అశోక్‌కుమార్‌ గౌడ్‌.. తన సిబ్బందితో హడావుడి చేశారు. రోడ్లపైకి వచ్చి సంబరాలు చేసుకుంటున్న రైతులు, మహిళల వద్దకు వచ్చి 144 సెక్షన్‌ అమల్లో ఉందని హెచ్చరించారు. వెంటనే ఇళ్లకు వెళ్లిపోవాలని మైక్‌లో అల్టిమేటం జారీ చేశారు.

Exit mobile version