Voter : ప్రజాస్వామ్య దేశాల్లో ప్రజల చేతుల్లో ఓటు వజ్రాయుధం. రాజకీయ నాయకులు ఒక్క ఓటే దేశ గతిని మారుస్తుంది.. ప్రజల భవిష్యత్ ను తీర్చిదిద్దుతుంది.. రాజకీయ నేత తలరాత మారుస్తుంది. అందుకే రాజకీయాల్లో ఉన్నవారు వందమంది షూటర్ల కంటే ఒక్క ఓటర్ కే భయపడుతారు. దేశ పౌరులు ప్రతీ ఒక్కరూ తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరముంటుంది. స్వచ్ఛందంగా ఓటు వేసి తమకు కావాల్సిన పనులు చేయించుకునే హక్కు ప్రజలకు ఉంటుంది. ప్రజాస్వామ్య పరిరక్షణలో మనం ఉండాలంటే ఓటు హక్కును వినియోగించడం తప్పనిసరి. మరో రెండు, మూడు నెలల్లో ఏపీలో అసెంబ్లీతో పాటు సార్వత్రిక ఎన్నికలు రాబోతున్నాయి. ఈక్రమంలోనే జనవరి 25న జాతీయ ఓటర్ దినోత్సవం జరుగబోతోంది.
ఈనేపథ్యంలో మీ ఓటు ఉందో లేదో తెలుసుకునే అవకాశం రానే వచ్చింది. ఓటు హక్కు.. ఎన్నికల సమయం వచ్చినప్పుడే అందరికీ గుర్తుకొస్తుంది. ఇలాంటి సమయంలోనే మన ఓటు హక్కుపై వేటు వేయడానికి అరాచక శక్తులు, అక్రమార్కులు ప్రయత్నిస్తుంటారు. అందుకే రీసెంట్ గా విడుదలైన ఓటరు జాబితాలో మీ ఓటు ఉందో లేదో సరిచూసుకోండి. జాబితాలో మీ పేరు గల్లంతైందా? మీ ఊరి ఓటరు జాబితాలో చనిపోయిన వారూ ఓటరుగా సజీవంగా ఉన్నారా? గంపగుత్తగా ఓట్లు తొలగించారా? అక్రమంగా చేర్చారా? అనేది సరిచూసుకోవాలి. ఎన్నికల్లో అక్రమాల కోసం ఎన్ని వేషాలు వేసినా పౌరుడిగా నీబాధ్యతను నిర్వర్తించు. దీనికి మీరు చేయాల్సిందల్లా ఓటరు జాబితాలో అక్రమాలపై అధికారులకు సమాచారం ఇవ్వండి.
కాగా, భారత ఎన్నికల సంఘం ఈనెల 25న జాతీయ ఓటర్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించబోతోంది. ఈ దినోత్సవాన్ని ‘‘నథింగ్ లైక్ ఓటింగ్, ఐ ఓట్ ఫర్ స్యూర్’ అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తోంది. ఏదీ ఏమైనా వచ్చే సార్వత్రిక, అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతీ ఓటరు తన ఓటును వినియోగించుకుని మంచి ప్రభుత్వాన్ని, మంచి పాలకులు ఎన్నికయ్యేలా దోహదపడాలి. అలాగే ఓటరు అంటే మందుకో, మనీకో లొంగిపోయే వాడు కాదని ప్రజాస్వామ సమరంలో నిర్ణయాత్మక శక్తి అని నిరూపించుకోవాలి.