YS Jagan : ఇప్పుడు గుర్తుకొచ్చామా..జగన్ కు క్యాడర్ షాక్!

YS Jagan

YS Jagan

YS Jagan : ఓటమి భారం నుంచి ఇప్పుడిప్పుడే వైసీపీ అధినేత జగన్ కోలుకుంటున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలోని 175 స్థానాలకు గాను కేవలం 11 స్థానాల్లో మాత్రమే వైసీపీ అభ్యర్థులు గెలవడాన్ని ఇప్పటికీ జగన్ జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే ఈ తప్పిదాల కారణంగా పార్టీకి ఈ స్థాయిలో ఓటమి ఎదురైంది అనేది జగన్ గుర్తించారు. వైసీపీ అధికారంలో ఉండగా పార్టీ క్యాడర్ కు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వకుండా.. వాలంటరీ వ్యవస్థ ద్వారానే అన్ని నడిపించారు. వారి సహకారంతోనే మళ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధిస్తామని గట్టిగా నమ్మారు. వారి ద్వారానే ప్రజలకు వైసీపీ మరింత చేరు అవుతుందని ఆయన వేసిన అంచనాలు అన్నీ తలకిందులు అయ్యాయి. కీలకమైన పోలింగ్ సమయంలో వాలంటీర్లు కలిసి రాలేదు. ఐదేళ్లపాటు తమను పట్టించుకోకుండా వాలంటీర్లకు ప్రాధాన్యం ఇవ్వడం, జనాల్లో తమకు అంతగా ప్రాధాన్యత దక్కకుండా పార్టీ కేడర్ కూడా 2024 ఎన్నికల సమయంలో పార్టీ విజయం కోసం పెద్దగా కష్టపడేందుకు ఇష్టపడలేదు.

దీంతో మళ్లీ  పార్టీ పునాదులు కదులుతున్నాయని భావించిన ఆయన కార్యకర్తల మదిని దోచేందుకు కొత్త ప్రయత్నాలు మొదలు పెట్టారు. కార్యకర్తల బలం, ఆదరణ లేకపోతే పార్టీ ఎలాంటి ఫలితాలను చవిచూడాల్సిందో జగన్ కి మొన్నటి ఎన్నికలు రుచి చూపించాయి. వైసీపీ ఓటమిపై అనేక దఫాలుగా పోస్ట్ మార్టం నిర్వహించిన జగన్, కార్యకర్తలను పక్కనపెట్టడం కూడా ఘోర పరాజయానికి ఓ కారణమని గ్రహించినట్లు తెలుస్తోంది. అందుకే పార్టీ కోసం పని చేసే క్యాడర్ ను మళ్లీ దగ్గరికి తీసుకునే పనిలో పడ్డారు. కార్యకర్తల కోసం రూ.10లక్షల మేర భీమా కల్పించే ఆలోచనలో జగన్ ఉన్నారట. కార్యకర్తలు ప్రమాదంలో గాయపడినా, మృతి చెందినా పార్టీ పరంగా అండగా ఉండేలా ఓ నిధిని ఏర్పాటు చేసే యోచనలో ఉన్నారని తెలుస్తోంది. ఈ ఆలోచనతో దూరమైనా క్యాడర్ మళ్లీ లైన్ లోకి వస్తుందని జగన్ భావించినా షాకింగ్ పరిణామాలే ఎదురు అవుతున్నాయి. అధికారం పోగానే మళ్లీ ఇప్పుడు వైసీపీకి కార్యకర్తలు గుర్తుకొచ్చారు. కార్యకర్తలు మాత్రం జగన్ ను నమ్మేందుకు ఆసక్తి చూపడం లేదు.

TAGS