Ayodhya Coronation : అయోధ్య పట్టాభిషేకానికి ముహూర్తం పెట్టింది ఎవరో తెలుసా?
Ayodhya Coronation : నాడు అయోధ్యలో శ్రీరామ పట్టాభిషేకం చేశారు! నేడు అయోధ్య రామాలయంలో విగ్రహ ప్రతిష్ట చేస్తున్నారు ! సిద్ధ పురుషులు, యోగులు, ధర్మానికి గ్లాని ఏర్పడినప్పుడు, అధర్మం పురుడు పోసుకున్నప్పుడు అవతారం తీసుకుంటారు. అటువంటి అవతార పురుషుడు చత్రపతి శివాజీ మహారాజు – అని విశ్వాసికుల అభిప్రాయం !
హిందూ మత ప్రాభావాన్ని కాపాడడానికి, సామ్రాజ్య స్థాపనకు జన్మ తీసుకున్న చత్రపతి శివాజీ మహారాజు పట్టాభిషేక సుముహూర్తాన కిరీట ధారణ చేయించిన – 17వ శతాబ్దానికి చెందిన కాశీ పండితుడు గాగాభట్ వంశీయుడు పండిట్ లక్ష్మీకాంత్ మాధూర నాథ్ ఈ అయోధ్య శ్రీరామ విగ్రహ ప్రతిష్టా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. నాడు అయోధ్యలో వశిష్టుల వారి చేతుల మీదుగా శుభ కార్యాలు జరిగాయి.
నేడు అయోధ్యలో ఈ లోకోత్తమ శుభకార్యానికి సుముహూర్తం నిర్ణయించిన ఘనాపాటి పండిట్ గణేశ్వర శాస్త్రి ద్రవిడ్. వీరు నిర్ణయించిన అ సుముహూర్తం కేవలం 84 సెకండ్లు మాత్రమే. ఏ పనికి ఆ పని రెప్పపాటు కాలంలో జరగవలసిన ఉంది. పండిట్ లక్ష్మీకాంత్ మాధుర్ నాధ్ కి వేదాంగ పండితులు జపతపాలు, హోమాలు చేసే పదిమంది చేయూతనిస్తారు. వీరికి మరో 130 మంది సహకరిస్తారు. ఈ 10 మందిలో ఒకరు లక్నో యూనివర్సిటీ సంస్కృత ప్రొఫెసర్ శ్యామలేష్ కుమార్ తివారీ ఒకరు.
ప్రపంచంలో చాలా దేశాలలో హిందూ మతం ఉంది. లక్షల సంఖ్యలో విఖ్యాత దేవాలయాలు ఉన్నాయి. ఎక్కడెక్కడో కొండ గుహలలో అరణ్యాలలో తపస్సు చేసుకుంటున్నవారు ; యోగ నిద్రలో ఉన్నవారున్నారు. ఆ మహనీయులు సూక్ష్మ రూపంలో ఈ క్రతువుకి విచ్చేస్తారని విశ్వాసికుల వ్యాఖ్య! దేశదేశాలలోని దేవాలయాల ప్రధాన అర్చకులు, బృందాలు ప్రత్యేక ఆహ్వానితులుగా వస్తున్నారు. అంతటా ఆధ్యాత్మిక పరిమళం వ్యాపిస్తుంది!!
– తోటకూర రఘు,
ఆంధ్రజ్యోతి వీక్లీ మాజీ సంపాదకులు.
09-01-2024