MS Narayana – Brahmanandam : ఎంఎస్ నారాయణ.. టాలీవుడ్ లో కామెడీకి కేరాఫ్ అడ్రస్ గా ఉన్నారు. తన నటనతో నవ్వులు పూయించాడు. ఎలాంటి పాత్ర అయినా తనదైన శైలిలో కామెడీ పండించి ప్రేక్షకులను అలరించేవారు. తెలుగు సినిమా చరిత్రలో హాస్యబ్రహ్మ బ్రహ్మానందంకు సరిసాటిగా గుర్తింపు సంపాదించుకున్నారు. మంచి మంచి పాత్రలు పోషించి అభిమానులను పెంచుకున్నారు.
సుమారు 17 ఏళ్ల సుదీర్ఘ కెరీర్ లో 700కు పైగా సినిమాల్లో నటించారు. దర్శకుడు రవిరాజా పినిశెట్టి వద్ద కొంతకాలం రచయితగా పనిచేశారు. ఆ తర్వాత నటుడిగా కొన్ని పాత్రలు చేశారు. ‘మా నాన్నకు పెళ్లి’ సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. దర్శకుడిగానూ తన ప్రతిభ చాటుకున్నారు. కొడుకు, భజంత్రీలు చిత్రాలకు దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నారు.
దర్శకుడు శ్రీను వైట్ల ఎంఎస్ ను ఎక్కువగా తన సినిమాల్లో తీసుకునేవారు. దూకుడు, దుబాయ్ శీనులో ఆయన నటన నవ్వులు పూయించింది. కాగా అనారోగ్య కారణాలతో 2015, జనవరి 23న హైదరాబాద్ లో కన్నుమూశారు. ఎప్పుడైతే ఎంఎస్ నారాయణ అనారోగ్యంతో హాస్పిటల్ లో చేరారో అప్పుడే అభిమానులు ఆయన ఇక రారని అనుకున్నారు. ఆ సమయంలో తన తోటి కమెడియన్ బ్రహ్మానందంకు చివరి కోరిక చెప్పారు ఎంఎస్ నారాయణ.
హాస్పిటల్ లో చేరిన ఎంఎస్ నారాయణ చనిపోయే 2 గంటల ముందు ఒక పేపర్ పై ‘బ్రహ్మానందం అన్నయ్యను చూడాలని ఉంది’ అని రాశారట. దీంతో ఆయన కూతురు వెంటనే బ్రహ్మానందంకు ఫోన్ చేసి రమ్మని చెప్పిందట. ఆయన హాస్పిటల్ కు పరుగు పరుగున వెళ్లారట. బ్రహ్మానందం చెవిలో ఎంఎస్ నారాయణ ఎదో చెప్పే ప్రయత్నం చేశారట. కానీ అది ఆయనకు అర్ధం కాలేదట.
బ్రహ్మానందం చేయి గట్టిగా పట్టుకొని అన్నయ్యా అని పిలిచాడు. ఆ స్థితిలో ఎమ్మెస్ ను చూడలేక బ్రహ్మానందం బయటకు వెళ్లారట. ఆయన వచ్చిన తర్వాత 15 నిమిషాలకే ఎంఎస్ నారాయణ కన్నుమూశారని బ్రహ్మానందం ఈ విషయం ఒక సందర్భంలో గుర్తు చేసుకొని బోరున విలపించారు. నిర్జీవంగా ఉన్న తన తమ్ముడిని చూసి గుండెలు బద్దలయ్యేలా ఏడ్చారట.