Fatty Liver : మనిషి శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవం కాలేయం. ఇది దాదాపు 500 పనులు చేస్తుంది. దీంతో దీన్ని కాపాడుకోవడం అందరి బాధ్యత. కానీ చాలా మంది నిరంతరం మందు తాగుతూ లివర్ పనిచేయకుండా చేసుకుంటున్నారు. ఫలితంగా ఫ్యాటీ లివర్ సమస్యతో సతమతమవుతున్నారు. ఫ్యాటీ లివర్ తో బాధపడే వారి సంఖ్య నిరంతరం పెరుగుతూనే ఉంది. లివర్ సరిగా పనిచేయడానికి కావాల్సిన యోగాసనాలు ఉంటాయి. అవేంటో తెలుసుకుందాం.
త్రికోణాసనం
లివర్ పనితీరు మెరుగుపడాలంటే త్రికోణాసనం ఎంతో ఉపయోగపడుతుంది. ముందుగా రెండుకాళ్లు దూరంగా ఉంచుకోవాలి. రెండు కాళ్ల మధ్య 3 అడుగుల దూరం ఉండాలి. రెండు చేతులను సమాంతరంగా లేపాలి. కుడి చేతిని కుడిపాదంపై పెట్టాలి. ఎడమ చేతిని గాల్లోకి లేపాలి. తలను గాల్లో ఎడమ చేతివైపుకు తిప్పాలి. అలా 10 నుంచి 30 సెకండ్ల పాటు ఉండాలి. తరువాత ఎడమ వైపునకు కూడా చేయాలి.
సలాంభ భుజంగాసనం
ఈ ఆసనం వేయడానికి బోర్లా పడుకోవాలి. కాలి వేళ్లను నేలకు ఆనించి ఉంచాలి. అరచేతులను, ముంజేతులను నేలకు ఆనించాలి. ప్రశాంతంగా గాలి పీలుస్తూ భుజాలు పైకి లేపాలి. వీపును కొద్దిగా వంచాలి. నాభి, కంటి ప్రాంతాలను నేలపై ఉంచాలి. అలా కొద్దిసేపటి వరకు శ్వాస వదులుతూ తిరిగి మామూలు స్థితికి రావాలి. ఇలా ఈ ఆసనం వేస్తే ఫ్యాటీ లివర్ సమస్య నుంచి విముక్తి కావచ్చు.
భుజంగాసనం
బోర్లా పడుకుని శరీరం సాగదీయాలి. రెండు పాదాల వేళ్లు, మడమలు తాకేలా చూసుకోవాలి. అరచేతులను చాతీ పక్కలకు పెట్టుకుని నేలకు ఆనించాలి. శ్వాసను తీసుకుంటూ నెమ్మదిగా తల, చాతీని పైకి లేపాలి. చేతులపై బలం మోపుతూ శ్వాస తీసుకుంటూ తల, చాతీ, కడుపు భాగాన్ని పైకి లేపాలి. కొద్దిసేపు అలాగే ఉంచి శ్వాసను వదులుతూ ఉండాలి.
ధనూరాసనం
ధనూరాసనం చేయాలంటే పొట్ట మీద పడుకోవాలి. రెండు మోకాళ్లను వెనక్కి మడిచి రెండు చేతులను వెనక్కి తీసుకెళ్లాలి. కుడిచేత్తో కుడికాలి మడాన్ని ఎడమ చేత్తో ఎడమకాలి మడాన్ని పట్టుకోవాలి. తరువాత పొట్టమీద బరువు మోపుతూ పైకి లేవాలి. ఇలా చేయడం వల్ల ఫ్యాటీ లివర్ సమస్య దూరం అవుతుంది. ఇలా ఫ్యాటీ లివర్ సమస్య రాకుండా చూసుకోవడం ఉత్తమం.