Raghuram : రఘురామ పదవి కోసం పవన్ చేసిన త్యాగం ఏంటో తెలుసా ?
Raghuram : శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నికైన రఘురామకృష్ణంరాజు నియమితులైన సంగతి తెలిసిందే. ఆయన డిప్యూటీ స్పీకర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా రఘురాంకు చంద్రబాబు, పవన్, అయ్యన్నపాత్రుడు అభినందనలు తెలిపారు. రఘురామ కృష్ణంరాజు అంటే తెలుగు రాజకీయాల్లో తెలియని వారు ఉండరు. రఘురామ దాదాపు ప్రతి ఎన్నికకు ఓ పార్టీ చొప్పున మారుతూ వస్తున్నారు. ముందు ఆయన కాంగ్రెస్ లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కి వీరాభిమానిగా ఉండేవారు. ఆ తర్వాత ఆయన కొడుకు జగన్ నెలకొల్పిన వైసీపీలోకి వెళ్లారు. 2014 ఎన్నికలకు ముందు వరకు నరసాపురం పార్లమెంట్ ఇన్ చార్జీగా ఉన్నారు. అనంతరం ఆ ఎన్నికలకు ముందు బిజెపి తీర్థం పుచ్చుకున్నారు. అటునుంచి టీడీపీలోకి వచ్చారు. చివరకు 2019 ఎన్నికల సమయంలో తిరిగి వైసీపీలోకి వెళ్లి నరసాపురం ఎంపీగా స్వల్ప మెజార్టీతో గెలిచారు. ఎంపీగా గెలిచిన ఏడాదికే వైసీపీతో పాటు అప్పటి సీఎం జగన్ తో విభేదించడం ప్రారంభించారు.
చివరకు జనసేన,బిజెపి, టీడీపీ మూడు పార్టీలతో సన్నిహితంగా ఉంటూ ఈ సంవత్సరం జరిగిన ఎన్నికలకు ముందు టీడీపీలో చేరి ఉండి ఎమ్మెల్యేగా గెలిచారు. తాజాగా ఆయనకు మంత్రి పదవి వస్తుందన్న అంచనాల నేపథ్యంలో కేవలం డిప్యూటీ స్పీకర్ పదవితో సరిపెట్టుకున్నారు. వాస్తవానికి ఈ పదవి కూడా జనసేనకు కేటాయించాలని ముందుగా చంద్రబాబు అనుకున్నారు. స్పీకర్ తెలుగుదేశం పార్టీకి ఇవ్వడంతో .. కూటమి ప్రభుత్వంలో కీలకంగా ఉన్న జనసేనకు డిప్యూటీ స్పీకర్ ఇవ్వాలని భావించారు. అయితే సామాజిక సమీకరణలతో పాటు గత వైసీపీ ప్రభుత్వంపై పోరాడిన రఘురామ కృష్ణంరాజుకు ఏదో ఒక పదవి ఇవ్వాలన్న అంచనాల నేపథ్యంలో చివరకు పవన్ సైతం రఘురామ పై ఉన్న ప్రేమ నేపథ్యంలో తమ పార్టీకి రావలసిన డిప్యూటీ స్పీకర్ పదవి త్యాగం చేశారు.. అలా రఘురామకు వచ్చిన డిప్యూటీ స్పీకర్ పదవి వెనక పవన్ చేసిన త్యాగం ఉంది.