Constipation Problems : ఈ రోజుల్లో చాలా మంది ఎదుర్కొంటున్న సమస్య మలబద్ధకం. దీంతో కడుపు ఉబ్బరంగా ఉంటుంది. మన జీవన శైలి, తీసుకునే ఆహారాలు మలబద్ధకానికి దోహదం చేస్తున్నాయి. ఎక్కువగా నూనె, మసాలాలు, కారం వాడకం వల్ల మలబద్ధకం సమస్య ఏర్పడుతుంది. ఆయిల్ ఫుడ్ తీసుకోవడం వల్ల ఎసిడిటి, మలబద్ధకం, కడుపు నొప్పి వంటి సమస్యలు రావడానికి ఆస్కారం ఏర్పడుతుందని తెలుసుకోవాలి.
మలబద్ధకం సమస్య దూరం కావడానికి యోగా కూడా సహాయపడుతుంది. నిత్యం మనం యోగా చేయడం వల్ల కూడా మలబద్ధకం సమస్య లేకుండా పోతుంది. ఈ ప్రాబ్లం చిన్న పిల్లలతో పాటు ముసలివారిలో కూడా ఎక్కువగా కనబడుతుంది. మలబద్ధకం సమస్య ఉంటే తలనొప్పి, దద్దుర్లు, నోటిపుండ్లు వంటి సమస్యలు కూడా కనిపిస్తాయి. ఉదయం పూట యోగా చేయడం వల్ల దీని నుంచి దూరం కావచ్చు.
మలబద్ధకం సమస్య నుంచి బయట పడాలంటే పవనముక్తాసనం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కింద వెల్లకిలా పడుకుని రెండు కాళ్లు చాతీపై వచ్చే వరకు తీసుకుని మన తల లేపి మోకాళ్లను తాకాలి. ఇంకా భుజంగాసనం కూడా తోడ్పడుతుంది. మనం బోర్లా పడుకుని రెండు చేతులు నడుము వరకు తీసుకొచ్చి మన శరీరాన్ని పైకి లేపాలి. దీంతో మలబద్ధకం సమస్యను సులభంగా పరిష్కరించుకోవచ్చు.
బాలాసనం అంటే వజ్రాసనంలో కూర్చుని రెండు చేతులను పైకి లేపి ముందుకు వంగాలి. ఇప్పుడు అరచేతులను నేలపైకి తీసుకువచ్చి తలను నేల వైపుకు వంచాలి. ఈ ఆసనం వేయడం వల్ల ఊబకాయం లేకుండా పోతుంది. శరీర నొప్పి, మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం పొందొచ్చు. ఇలా ఈ ఆసనాలు వేసుకుని మలబద్ధకం సమస్య నుంచి బయట పడొచ్చని చెబుతున్నారు.