Jabilli : జాబిల్లిపై లోతైన గుహలు.. ఎంత లోతో తెలుసా..? వాటిపై శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే?
Jabilli : చందమామ (జాబిల్లి) పై నివాసం ఏర్పాటుపై సాధ్యా సాధ్యాలను అన్వేషిస్తున్న శాస్త్రవేత్తలకు ఒక శుభవార్త తెలిసింది. అదేంటంటే మూన్ పై లోతైన గుహలు ఉన్నట్లు ఇటీవల బయటపడింది. అయితే ఇది ఒక్కటి మాత్రమే కనిపించింది. దీన్ని పరిశీలించిన శాస్త్రవేత్తలు ఇలాంటివి ఇంకా అనేకం ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ గుహ పెద్దదిగానే కనిపిస్తుందని, మరింత పరిశోధన జరగాల్సి ఉందని వారు చెప్తున్నారు.
ఈ బిలంలోకి ప్రవేశ మార్గం కూడా ఉన్నట్లు కనుగొన్నామన్నారు. 1969లో నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్, ఆల్డ్రిన్ దిగిన ‘సీ ఆఫ్ ట్రాంక్విలిటీ’కి 400 కిలో మీటర్ల దూరంలో ఇది బయటపడిందని వారు చెప్తున్నారు. లావా బయటకు చిమ్మడం ద్వారా సొరంగం ఏర్పడినట్లు పరిశోధకులు విశ్లేషిస్తున్నారు. అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా) ప్రయోగించిన ‘లూనార్ రికానసెన్స్ ఆర్బిటర్ (ఎల్ఆర్వో)‘ అందించిన రాడార్ కొలతలను విశ్లేషించిన శాస్త్రవేత్తలు.. ఆ వివరాలను భూమిపై ఉన్న లావా సొరంగాలతో పోల్చారు. నేలమాళిగలోని ఒక గుహకు సంబంధించి కొంత సమాచారాన్ని రాడార్ వెల్లడి చేస్తోంది.
ఆ బిలం వెడల్పు 130 అడుగులు, పొడవు పదుల మీటర్లలో ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఇలాంటి గుహలు వ్యోమగాములకు సహజసిద్ధ షెల్టర్లుగా ఉపయోగపడతాయని శాస్త్రవేత్తలు తెలిపారు. విశ్వం నుంచి వచ్చే కాస్మిక్ కిరణాలు, సౌర రేడియోధార్మికత, చిన్నపాటి ఉల్కల నుంచి ఇలాంటి గుహలు రక్షిస్తాయని తెలిపారు. చందమామపై పునాది వేసుకొని ఆవాసాన్ని నిర్మించేందుకు చాలా సమయం పడుతుందని, పైగా అది సవాళ్లతో కూడుకుందని వివరించారు. అక్కడి గుహల్లో శిలలు, ఇతర పదార్థాలు.. లక్షల ఏళ్లుగా కఠిన వాతావరణ పరిస్థితులను ఎదుర్కొని ఉండవచ్చని తెలిపారు. వాటిని పరిశోధిస్తే చంద్రుడి గురించి మరింత లోతైన సమాచారం దొరుకుతుందని పేర్కొన్నారు. అక్కడి అగ్నిపర్వతాలపై అవగాహన పెరుగుతుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.