Meri Saheli : ఒంటరిగా రైలులో ప్రయాణిస్తున్నారా? మగవారు ఎవరూ తోడు లేకుండా దూరప్రాంతాలకు వెళ్లే పని పడిందా? అయినా మీరు భయపడనవసరం లేదు. ఏ చింత లేకుండా మీ ప్రయాణం ఆనందంగా కొనసాగించవచ్చు. ‘మేరీ సహేలీ’ గురించి తెలుసుకుంటే మీ సందేహాలన్నీ తీరిపోతాయి. మీరు ఇక రైలులో ప్రశాంతంగా అగంతకులు, దుండగుల బారిన పడకుండా ప్రయాణించవచ్చు.
మహిళా ప్రయాణికుల భద్రతపై భారతీయ రైల్వే ప్రత్యేక దృష్టి సారించింది. ప్రత్యేకించి ఒంటరిగా ప్రయాణం చేసే మహిళల రక్షణ కోసం ‘ఆపరేషన్ మేరీ సహేలీ’ పేరిట ప్రత్యేక రక్షణ బృందాలను ఏర్పాటు చేసింది. సాధారణంగా మహిళలు ఒంటరిగా దూర ప్రయాణం చేయవలిసి వచ్చినప్పుడు కొంత అభద్రతాభావానికి గురయ్యే అవకాశం ఉంటుంది. అలాంటి వారికి అన్ని విధాలుగా అండగా ఉండి వారి ప్రయాణం పూర్తయ్యే వరకు రక్షణ కల్పించే లక్ష్యంతో మేరీ సహేలీ మహిళా భద్రతా సిబ్బంది ప్రయాణికులతో పాటు రైళ్లలో ప్రయాణం చేస్తారు. ఇందుకోసం మహిళా సిబ్బందికి వివిధ అంశాలలో శిక్షణ ఇచ్చారు. వీరు మహిళా ప్రయాణికులు రైలు ఎక్కేందుకు, దిగేందుకు సహకరిస్తారు. స్టేషన్ లే అవుట్ పైన అవగాహన కల్పిస్తారు. ప్రయాణంలో ఎలాంటి ఇబ్బంది ఉన్నా పరిష్కరించేందుకు సహాయం చేస్తారు. మేరీ సహేలీ యాప్ కూడా గూగుల్ ప్లే స్టోర్ లో అందుబాటులో ఉంది. దాన్ని డౌన్ లోడ్ చేసుకుని ప్రయోజనం పొందవచ్చు.
మేరీ సహేలీ భద్రతనే కాకుండా మహిళల రక్షణ కోసం అనేక రైల్వే చట్టాలు ఉన్నాయి. వీటి ద్వారా మహిళలు ఏ భయం లేకుండా తమ ప్రయాణాన్ని సంతోషంగా చేయవచ్చు. అలాగే మహిళల హక్కులకు భంగం వాటిల్లకుండా ఈ చట్టాలు కాపాడుతాయి. 1989లో భారతీయ రైల్వే ఒంటరి మహిళా ప్రయాణికులకు ప్రత్యేక రక్షణ చట్టాన్ని రూపొందించింది. ఆ చట్టంలోని అంశాలను ఒకసారి తెలుసుకుందాం..
సెక్షన్ 139:
-టికెట్ లేకుండా ప్రయాణించే మహిళను లేదా బిడ్డతో ప్రయాణించే మహిళను టీటీఈ రైలు కిందకు దించరాదు. రాబోయే స్టేషన్ లో టికెట్ తీసుకోవాలని సూచించాలి. అది కూడా ఒక మహిళ కానిస్టేబుల్ ఉన్నప్పుడే ఆమెను కిందకు దించాలి.
– రైల్వేలో మహిళా కోటా రిజర్వేషన్లలో 45 ఏండ్లు పైబడిన మహిళలకు ప్రాధాన్యం ఉంటుంది. ఇంతకుముందు స్లీపర్ క్లాస్ లో ఉండే ఈ సదుపాయం ఏసీలో కూడా అందుబాటులోకి వచ్చింది.
సెక్షన్ 162:
-మహిళలకు కేటాయించిన కంపార్ట్ మెంట్లలో 12 ఏండ్ల కంటే తక్కువ వయస్సున్న పురుషులు మాత్రమే ప్రయాణించడానికి వీలుంది. అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారికి అవకాశం లేదు.
సెక్షన్ 311:
-సైన్యంలో పనిచేసే పురుషులు మహిళా కంపార్ట్ మెంట్లలోకి వస్తే అక్కడి సిబ్బంది వారిని మర్యాదపూర్వకంగా ఇతర కంపార్ట్ మెంట్లలోకి పంపించాలి.
– ఒంటరిగా ప్రయాణించే మహిళలు టీటీఈతో మాట్లాడి తన సీటును మార్చుకోవచ్చు.
-రాష్ట్రపతి నుంచి పోలీస్ మెడల్, ఇండియన్ పోలీస్ అవార్డు పొందిన మహిళలకు చార్జిలలో 50 శాంతం రాయితీ ఇస్తారు.