Toll Plaza : సంక్రాంతి, దసరా పండుగ వస్తుందంటే చాలు హైదరాబాద్ నగరం ఖాళీ అయిపోతుంది. అందరూ ఇండ్లకు పయనం కావడంతో నగరం బోసిపోతుంది. హైదరాబాద్ నుంచి ఆంధ్రాకు, తెలంగాణ పల్లెలకు వెళ్లడానికి ప్రధానమైనవి విజయవాడ హైవే, వరంగల్ హైవే. ఈ హైవేలపై పండుగలు వచ్చాయంటే చాలు వేలాది వాహనాలు బారులు తీరుతాయి. విజయవాడ వైపు వెళ్లేవారు పంతంగి టోల్ ప్లాజా దగ్గర, వరంగల్ వైపు వెళ్లేవారు బీబీనగర్ టోల్ ప్లాజా దగ్గర నరకం అనుభవించాల్సి వస్తుంది. టోల్ ప్లాజా దాటడానికి గంటల సమయం పడుతుంది. ఈ కష్టాలు ఇక్కడే కాదు దేశంలోని ప్రధాన నగరాల్లో అంతటా ఉన్నాయి. దీనికి పరిష్కారంగా కేంద్రం సరికొత్త ఆలోచన చేసింది. దాన్ని ప్రస్తుతం ముంబైలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నారు.
దీని ప్రకారం హైవేలపై ప్రస్తుతం అమల్లో ఉన్న టోల్ ప్లాజా లు త్వరలోనే చరిత్రలో కలిసిపోనున్నాయి. కేంద్రం కొత్త టోల్ వసూలు వ్యవస్థను ప్రవేశపెట్టబోతోంది. త్వరలో శాటిలైట్ ఆధారిత టోల్ వసూళ్లను ముంబైలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించింది. ఈ విషయమై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మార్చిలోనే కీలక ప్రకటన చేశారు. వాహనాల నుంచి రుసుమును మినహాయించడానికి ఎంపిక చేసిన కేంద్రాల వద్ద జీపీఎస్ కెమెరాలను ఉపయోగిస్తామన్నారు. ప్రస్తుతం దీన్ని కొన్ని ఎంపిక చేసిన మార్గాలలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తామన్నారు. ఈ విధానంలో వినియోగదారుడి బ్యాంక్ ఖాతా నుంచి నేరుగా రుసుమును మినహాయిస్తుంది. టోల్ మొత్తం వాహనం ప్రయాణించిన దూరంపై ఆధారపడి ఉంటుంది. ఈ సమాచారమంతా జీపీఎస్ ద్వారా సేకరిస్తారు. ప్రస్తుతం వాహనం ప్రయాణించే దూరంతో సంబంధం లేకుండా టోల్ ప్లాజా వద్ద ఫీజును వసూలు చేస్తున్న విషయం తెలిసిందే.
ముంబై ఎక్స్ ప్రెస్ హైవే పై పైలట్ ప్రాజెక్టుగా శాటిలైట్ సిస్టంను అమలు చేస్తున్నారు. ఇక్కడ హైవేపై ఇంతకు ముందు టోల్ ప్లాజాలు ఉన్న దగ్గర వాటిని తీసివేసి శాటిలైట్ ద్వారా వాహనాల నుంచి టోల్ వసూలు చేస్తున్నారు. టోల్ ప్లాజా లేకపోవడంతో వాహనాలు రయ్ రయ్ మంటూ పరుగులు తీస్తున్నాయి. ఇక గతంలో మాదిరిగా ట్రాఫిక్ కష్టాలు కానీ, బారులు తీరడం కానీ, టోల్ ప్లాజ్ దగ్గర టైం వేస్ట్ కానీ లేకపోవడంతో వాహనదారులు హ్యాపీగా తమ జర్నీని కొనసాగించవచ్చు.