Jagan : జగన్ యూకే పర్యటనకు అనుమతి ఇవ్వద్దు..: కోర్టును అభ్యర్థించిన సీబీఐ
Jagan : ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కాలం అస్సలు కాలిసి రావడం లేదు. ఎన్నికల్లో దారుణమైన పరాభవం, ఆ తర్వాత పార్టీ నాయకుల్లో అంత: కలహాలు, కూటమి వైపు నేతల ఎదురు చూపులు, వీటన్నింటితో పాటు తనపై ఉన్న అక్రమాస్తుల కేసులు వీటన్నింటితో జగన్ సతమతమవుతున్నాడు.
అక్రమ ఆస్తుల కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విదేశీ టూర్ కు అనుమతి ఇవ్వద్దని సీబీఐ ధర్మాసనాన్ని కోరింది. సెప్టెంబర్లో భారత్ వదిలి యూకే వెళ్లేందుకు జగన్మోహన్ రెడ్డి సన్నాహాలు చేసుకున్నారు. ఈ మేరకు ఆయన అనుమతి కోసం సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విదేశాల్లో తన కుమార్తె చదువుకుంటుందని ఆమెతో కొన్ని రోజులు గడిపేందుకు వెళ్తున్నానని అనుమతి ఇవ్వాలని న్యాయ స్థానాన్ని కోరాడు.
ఈ పిటిషన్ ఈ రోజు (ఆగస్ట్ 21 బుధవారం) విచారణకు రాగా, దీనిపై సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. సీబీఐ తన కౌంటర్తో చాకచక్యంగా వ్యవహరించింది. నిందితుడు జగన్మోహన్ రెడ్డి దేశం దాటితే దర్యాప్తు ప్రక్రియ మరింత మందగించే అవకాశం ఉంటుందని, జగన్ విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వద్దని సీబీఐ న్యాయవాది కోర్టును అభ్యర్థించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్ను దేశం విడిచి వెళ్లేందుకు అనుమతించవద్దని సీబీఐ దాఖలు చేసిన కౌంటర్లో స్పష్టం చేసింది.
దీనిపై తదుపరి విచారణను వాయిదా వేసిన కోర్టు తీర్పును ఆగస్ట్ 27కు వాయిదా వేసింది. దీంతో తన కుమార్తెను కలిసేందుకు జగన్ యూకే పర్యటనకు సీబీఐ కోర్టు అనుమతి ఇస్తుందా? లేదా అన్నదానిపై ఉత్కంఠత నెలకొంది. విపరీతమైన పరిస్థితుల్లో తప్ప, విదేశాలకు వెళ్లేందుకు అటువంటి పిటిషన్లను కోర్టు తిరస్కరించదు. మరి ఇప్పుడు జగన్ పిటిషన్పై ఎలాంటి తీర్పు వెలువడుతుందో చూడాలి.