Tamil Nadu : తమిళనాడు లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో స్టాలిన్ ఆధ్వర్యంలోని డీఎంకే పార్టీ భారీ విజయం నమోదు చేసింది. డీఎంకే, కాంగ్రెస్ కూటమి రాష్ట్రంలోని మొత్తం 39 సీట్లను క్లీన్ స్వీప్ చేసింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజం చేస్తూ ఇండియా కూటమి భారీ విజయాన్ని సాధించింది. ‘‘నర్పతుం నమతే, నడు నమతే’’ (మొత్తం 39 సీట్లు మనవే) అనే నినాదంతో ఎన్నికలకు వెళ్లిన డీఎంకే కూటమి, అన్నింటినీ గెలుచుకొని అద్భుతమైన విజయాన్ని సాధించింది.
డీఎంకే స్టార్ కాంపెయినర్ కనిమొళి, నీలగిరి నుంచి రాజా, సెంట్రల్ చెన్నై నుంచి దయానిధి మారన్, శ్రీపెరంబుదూర్ నుంచి టీఆర్ బాలు సహా కూటమి పార్టీలు కాంగ్రెస్, సీపీఐ, సీపీఐ (ఎం), వీసీకే ఎండీఎంకే, ఐయూఎంఎల్ కు చెందిన అభ్యర్థులంతా తిరుగులేని మెజార్టీతో గెలిచారు. తమిళనాడులో కాంగ్రెస్, కమ్యూనిస్టులతో కూడిన డీఎంకే కూటమి విజయ పరంపర 2019 లోక్ సభ ఎన్నికలలోనే ప్రారంభమైంది. 2021 అసెంబ్లీ ఎన్నికలు, ప్రస్తుత లోక్ సభ ఎన్నికల్లో కూడా అది కొనసాగి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.