Diwali Winner : దీపావళి విన్నర్ డిసైడ్..!ఈ నాలుగు చిత్రాల్లో ఎవరు పై చేయి సాధించారంటే?
Diwali Winner : దసరా, సంక్రాంతి మధ్యలో సినీ ఇండస్ట్రీకి మరో ముఖ్యమైన పండుగ. దీపావళి. ఈ దీపావళికి తమిళనాడులో పెద్ద చిత్రాల సందడి ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ సారి అక్కడా దీపావళి సందడి కనిపించడం లేదు. అయితే ఈ సారి తెలుగులో కూడా ఆ పోటీ కనిపించింది. అయితే ఇందులో మూడు సినిమాల్లో హీరోలు తమిళ, మలయాళ, కన్నడ హీరోలు కాగా, ఒక్కడు మాత్రమే మన తెలుగు హీరో. హీరో దుల్కర్ సల్మాన్ అటు మలయాళంతో పాటు ఇటు టాలీవుడ్ కు అంతే ప్రాధాన్యం ఇస్తున్నాడు. ఇక తమిళం నుంచి శివకార్తికేయన్ సినిమాలు అనువాదమవుతూనే ఉన్నాయి. ఇక కన్నడ హీరో శ్రీ మురళికి సాండల్ వుడ్ మంచి ఫాలోయింగ్ ఉంది. ఈ ముగ్గురిలో తెలుగులో మంచి మార్కెట్ ఉన్నది దుల్కర్ సల్మాన్ కే. మహానటి, సీతారామంతో తెలుగు హీరోలతో సమానంగా తన ఫాలోయింగ్ ను పెంచుకుంటున్నాడు. ఇక శివ కార్తికేయన్ పెద్దగా ప్రభావం చూపకున్నా తమిళనాడులో మాత్రం స్టార్ హీరోగా రాణిస్తు్న్నాడు.
ఈ సారి ఈ బహుభాషా హీరోలతో పోటీపడ్డాడు కిరణ్ అబ్బవరం. తొలిసారి కిరణ్ అబ్బవరం సినిమా ‘క’ కూడా పాన్ ఇండియా స్థాయిలో విడుదలైంది. ఈ దీపావళికి తెలుగులో నాలుగు సినిమాలు విడుదల కాగా, ఇందులో కేవలం రెండు సినిమాలకు మాత్రమే మంచి బజ్ ఉంది.
తెలుగులో విడుదలైన ‘అమరన్’, ‘భగీర’ డబ్బింగ్ సినిమాలు కాగా, ‘లక్కీ భాస్కర్’, ‘క’ తెలుగుతో పాటు పాన్ ఇండియా స్థాయిలో రూపుదిద్దుకున్నాయి. వీటిల్లో కన్నడ ‘భగీర’ చిత్రానికి తప్ప, మిగిలిన మూడు చిత్రాలకు సూపర్ హిట్ టాక్ వినిపస్తున్నది. ‘భగీర’ చిత్రానికి కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కథ, మాటలు అందించడం విశేషం. ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిన దర్శకుడు ప్రశాంత్ నీల్ కథ అందించిన సినిమా భారీ డిజాస్టర్ అవుతుందని ఎవరూ ఊహించలేదు. నేరుగా ప్రశాంత్ నీల్ ప్రమోషన్స్ చేయకపోవడంతో పెద్ద బజ్ కనిపించలేదు.
ఇక దుల్కర్ సల్మాన్ నటించిన ‘లక్కీ భాస్కర్’ చిత్రానికి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. బుక్ మై షో యాప్ లో ఈ చిత్రానికి గంటకి 15 వేల సేల్ అవుతున్నాయంటే ఎంత హిట్టో అర్థం చేసుకోవ్చు. ఈ చిత్రం మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ. పది కోట్ల షేర్ సాధిస్తుందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. తమిళ హీరో శివ కార్తికేయన్ నటించిన ‘అమరన్’ సినిమాకు ‘లక్కీ భాస్కర్’ కి మించిన అడ్వాన్స్ బుకింగ్స్ తెలుగు వెర్షన్ లో ఉండడంతో అంతా ఆశ్చర్యపోయారు. ‘లక్కీ భాస్కర్’ టికెట్ రేట్ల తో పోలిస్తే ‘అమరన్’ సినిమా టికెట్ రేట్లు తక్కువ ఉండడంతో తెలుగు వెర్షన్ ఓపెనింగ్స్ దుల్కర్ సల్మాన్ సినిమా కంటే తక్కువే ఉంటుందని తెలుస్తున్నది. తొలి రోజు ఈ సినిమా 7 కోట్ల రూపాయిల షేర్ సాధించే అవకాశం ఉందని తెలుస్తున్నది.
ఇక టాలీవుడ్ హీరో కిరణ్ అబ్బవరం ‘క’ చిత్రానికి తొలి షో నుంచే మంచి టాక్ బయటకు వస్తున్నది. ఈ రెండు సినిమాలతో సమానంగా ఆ చిత్రానికి అడ్వాన్స్ బుకింగ్స్ బాగున్నాయని తెలుస్తున్నది. ఓపెనింగ్స్ రూ. 5 కోట్లు వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తున్నది. కిరణ్ అబ్బవరం కెరీర్ లోనే ఇదే భారీ ఓపెనింగ్ నిలువనున్నది. తొలి మూడు రోజుల్లోనే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఫుల్ రన్ లో ఈ ముగ్గురులో ఎవరు పై చేయి సాధిస్తారో చూడాల్సిందే.