Hong Kong Diwali Event : ది హాంకాంగ్ తెలుగు సమాఖ్య (THKTS) ఆధ్వర్యంలో ‘దీపావళి-2023’ వేడుకలు కన్నుల పండువగా నిర్వహించారు. ఇండియా క్లబ్‌లో నిర్వహించిన ఈ వేడుకల్లో సమాఖ్యలో సభ్యుల కుటుంబాలు పాల్గొన్నాయి. ఈ ఈవెంట్ కు వచ్చిన వారికి వ్యవస్థాపక అధ్యక్షురాలు జయ పీసపాటి ప్రారంభ ఉపన్యాసం తో స్వాగతం పలికారు. ప్రవాసులు వేడుకలు నిర్వహించుకోవడం మరింత ఆనందంగా ఉందన్నారు. ప్రవాసులు ఒక్కచోట చేరడం చూస్తే మనకు ఇక్కడ కూడా తోడు ఉన్నారన్న భావన కలుగుతుందన్నారు.
చిన్నా, పెద్దలు ఈ ఈవెంట్ లో ఆనందంగా పాల్గొనడం చూస్తుంటే ఇండియాలో ఉన్నామన్న ఆనందం కలుగుతుందన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అందరూ సమష్టిగా కృషి చేశారని తెలిపారు. కార్యవర్గ సభ్యులు రాజశేఖర్ మన్నె, రమాదేవి సారంగ, హరీన్ తుమ్మల, రమేశ్ రేనిగుంట్ల, మాధురి అరవపల్లి తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
కార్యక్రమంలో హాంకాంగ్ లో తెలుగు వారు చేసిన డ్యాన్స్ అలరించింది. ఈ సందర్భంగా నిర్వహించిన వింధు భోజనం లో పాల్గొన్న వారు సంతోషంగా ముచ్చట్లు పెట్టుకుంటూ ఆరగించారు. ప్రదర్శనలో పాల్గొన్న ప్రతీ ఒక్కరిని అభినందిస్తూ.. సర్టిఫికెట్లు, జ్ఞాపికను అందజేశారు. కార్యక్రమానికి వ్యాఖ్యాతగా రాధిక సంబతూర్, రాధిక నూతలపాటి వ్యవహరించి ఆకట్టుకున్నారు.
హాంకాంగ్ లో దాదాపు మూడు దశాబ్దాలకు పైగా నివసిస్తున్న వైద్య నిపుణుడు డాక్టర్ మోహన్ భాస్కరభట్ల ఆయన సతీమణి సూర్య ఈ కార్యక్రమానికి హాజరవడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. తర్వాత గ్రూప్ ఫొటోలు, సెల్ఫీలు దిగారు. భారత జాతీయ గీతంతో కార్యక్రమానికి ముగింపు పలికారు.