Diwali bonanza : దీపావళి కానుకగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏను 3 శాతం పెంచేందుకు కేబినెట్ ఆమోదించింది. ఈ మేరకు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ బుధవారం వెల్లడించారు. తాజా పెంపుతో ఇప్పటి వరకు ఉన్న 50 శాతం డీఏ 53 శాతానికి చేరనుంది. ఈ ఏడాది జులై 1వ తేదీ నుంచి దీన్ని అమలు చేయనున్నట్లు కేంద్రమంత్రి తెలిపారు. దీనివల్ల కేంద్ర ఖజానాపై రూ.9448 కోట్ల అదనపు భారం పడనుందని పేర్కొన్నారు.
డీఏ పెంపుతో దాదాపు కోటి మంది ఉద్యోగులు, పెన్షనర్లు ప్రయోజనం పొందనున్నారు. కాగా, సార్వత్రిక ఎన్నికలకు ముందు ఈ ఏడాది మార్చిలో డీఏను 4 శాతం పెంచిన సంగతి తెలిసిందే. ఏటా రెండు సార్లు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏను కేంద్రం సవరిస్తూ ఉంటుంది. పెరుగుతున్న ధరలకు పరిహారంగా ఉద్యోగులు, పెన్షనర్లకు ఈ కరవు భత్యాన్ని అందజేస్తారు.