Nagababu : పిఠాపురంలో భారీ ఎత్తున వైసీపీ నేతలు డబ్బులు పంపిణీ చేస్తున్నారని జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు ఆరోపించారు. తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గం నుంచి జనసేనాని పవన్ కళ్యాణ్ పోటీ చేస్తుండడంతో అందరి దృష్టి ఆ నియోజకవర్గంపై ఉంది. దీంతో ఆ స్థానం ప్రధాన పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారింది. పవన్ ను భారీ మెజార్టీతో గెలిపించేందుకు జనసైనికులు పోరాడుతున్నారు. వైసీపీ నేతలు మాత్రం ఓట్లు కొనేందుకు ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా పిఠాపురం నియోజకవర్గంలో నగదు పంపిణీ వ్యవహారంపై జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు స్పందించారు.
‘‘వైసీపీ నేతలు ఆదివారం రాత్రి నుంచి నగదు పంపిణీ ప్రక్రియను వేగవంతం చేయనున్నట్లు తెలిసింది. వైసీపీ రౌడీలు, గూండాలు ప్రతి ఇంటికీ డబ్బు అందిస్తారు. డబ్బులు తీసుకున్న వారి వేళ్లపై ఓటేసినట్టు సిరా మార్కు వేస్తారంట. వారందరినీ ఎల్లుండి ఓటు వేసేందుకు అనర్హులుగా మారుస్తున్నారు. సిరా గుర్తు చూసి ఆయా ఓటర్లను ఎన్నికల అధికారులు అనర్హులుగా ప్రకటించే అవకాశముంది. వేళ్లపై సిరా చుక్క వేస్తామంటే ప్రజలు తిరస్కరించాలి. డబ్బు పంపిణీ, సిరాగుర్తు అంశాలను ఈసీ దృష్టికి తీసుకెళ్తాం’’ అని నాగబాబు తెలిపారు.