JAISW News Telugu

Chandrababu : టీడీపీకి సంకట పరిస్థితి.. బీజేపీ కండీషన్లపై చంద్రబాబు ఏం చెబుతారు?

Chandrababu

Chandrababu

Chandrababu : ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. పార్టీల్లో టెన్షన్ మొదలైంది. వైసీపీ అభ్యర్థుల ప్రకటనను త్వరలోనే పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఇక టీడీపీ, జనసేన కూటమిలోకి బీజేపీ చేరిక ఖాయమైనప్పటికీ..ఆ పార్టీ పెట్టిన కండీషన్లు టీడీపీని తీవ్ర అంతర్మథనంలో పడవేశాయి. బీజేపీ కండీషన్లు ఒప్పుకోవాలా? వద్దా? ఒప్పుకుంటే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి? ఒప్పుకోకుంటే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి?.. ఇప్పుడీ సంకట పరిస్థితిని టీడీపీ అధినేత ఎలా ఎదుర్కొంటాడో అనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

రాబోయే ఎన్నికలు టీడీపీకి జీవన్మరణ సమస్య. అందుకే బలమైన వైసీపీని ఎదుర్కొవాలంటే ఒక్కరి వల్ల అయ్యే పనికాదు. పొత్తు లేకపోతే ప్రభుత్వ వ్యతిరేకత ఓట్లు చీలి అంతిమంగా వైసీపీకే ప్రయోజనకరంగా మారుతుంది. అందుకే ప్రభుత్వ వ్యతిరేకత ఓటు సంఘటితం కావాలంటే పొత్తులు అనివార్యం. అందుకే జనసేనతో పొత్తు. రాష్ట్రంలో బలమైన ఓటు బ్యాంకు ఉన్న జనసేనతో కలిస్తే అధికారంలోకి రావడం ఖాయమనే ఆలోచనతో చంద్రబాబు జనసేనానితో చేతులు కలిపారు. ఇక అధికారంలో ఉన్న జగన్ వ్యూహాలకు చెక్ పెట్టాలంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తమకు తోడైతే ఇక కూటమికి తిరుగుండదు.

ఈ ఎన్నికల్లో వైసీపీ గెలిస్తే.. టీడీపీకి రాజకీయంగా ఎంతో నష్టం. ఎట్టి పరిస్థితుల్లోనూ టీడీపీ గెలవాల్సిన పరిస్థితి. అప్పుడే పార్టీని బతికించుకోవచ్చు. అందుకే తమ సీట్లలో కోత పడినా జనసేన, బీజేపీలతో పొత్తు పెట్టుకోవాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి బీజేపీ పెద్దలతో పొత్తు చర్చలు జరిపారు. కానీ అమిత్ షా పెట్టిన కండీషన్ లే చంద్రబాబుకు కొత్త తలనొప్పిని తెస్తున్నాయి.

టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు కుదరాలంటే అమిత్ షా చెప్పిన కండీషన్లను ఒకసారి చూస్తే.. జనసేన, బీజేపీలకు 50-60 సీట్ల దాక అసెంబ్లీ సీట్లు, 10 వరకు ఎంపీ సీట్లు, సీఎం పదవిలో షేరింగ్. ఈ కండీషన్లతో చంద్రబాబు ఏం చేయాలో పాలుపోవడం లేదని తెలుస్తోంది. వీటికి ఒప్పుకుంటే గెలుపు ఖాయమే కాని.. పవర్ లో షేరింగ్ తో పాటు, టీడీపీ సీట్లకు కోత పడితే.. పార్టీ భవిష్యత్ కు ఇబ్బందే. ఈ కండీషన్లకు క్యాడర్ లో అసహనం బయలుదేరే అవకాశం ఉంది. అలాగే జనసేన నుంచి పవన్ కల్యాణ్ ను సీఎం అయితే అనూహ్యంగా భవిష్యత్ లో పెద్ద పార్టీగా అవతరించే అవకాశం ఉంటుంది. అది టీడీపీకి మరో ప్రత్యర్థి పార్టీని తెచ్చుకోవడమే అవుతుంది. ఇలా ఏ రకంగా చూసినా విపత్కర పరిస్థితిని టీడీపీ ఎదుర్కొంటోంది.

ఒకవేళ కండీషన్లకు ఒప్పుకోకపోతే పొత్తులు ఖాయం కావడం కష్టమే. ఇది అంతిమంగా మళ్లీ వైసీపీకి లాభదాయకమవుతుంది. కేంద్రంలో మళ్లీ మోదీకే అవకాశాలు ఉన్నట్లు అంచనాలు కనపడుతుండడంతో ఆ పార్టీతో సఖ్యత అవసరం. ఇలా బీజేపీ పెట్టిన కండీషన్లపై టీడీపీ అధినేత తీవ్ర మేధోమధనం చేయాల్సిన అవసరం ఏర్పడింది. పార్టీ భవిష్యత్ కు, తమ(చంద్రబాబు, లోకేశ్) నాయకత్వానికి ఈ ఎన్నికలు పెద్ద సవాలే. మరి ఈ కండీషన్లకు నో చెప్పాలా? ఎస్ చెప్పాలా? అని చంద్రబాబు  తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు కనిపిస్తోంది. చంద్రబాబు నిర్ణయంపైనే పొత్తుల వ్యవహారం కొలిక్కి వచ్చే అవకాశమైతే కనపడుతోంది.

Exit mobile version