Kadapa Court : షర్మిల, సునిత, బీటెక్ రవిల పిటిషన్ల కొట్టివేత
Kadapa Court : వైఎస్ వివేకా హత్య కేసుకు సంబంధించి బహిరంగంగా మాట్లాడవద్దని ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని దాఖలైన మూడు వెకేషన్ పిటీషన్లను కొట్టివేస్తూ కడప జిల్లా ప్రధాన న్యాయమూర్తి బుధవారం తీర్పు చెప్పారు. వివేకా హత్య కేసుపై కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని, దీనిపై చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు సురేశ్ బాబు గత నెలలో కడప కోర్టులో సివిల్ దావా వేశారు. దానిపై విచారించిన కోర్టు ఈ కేసుకు సంబంధించి ఎవరూ మాట్లాడవద్దని ఏప్రిల్ 16న ఉత్తర్వులు ఇచ్చింది.
అయితే, ఆ ఉత్తర్వులను రద్దు చేయాలని వైఎస్ షర్మిల, సునిత, బీటెక్ రవిలు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేయగా కడప కోర్టుకే వెళ్లాలని హైకోర్టు సూచించింది. దీంతో వారు కడప కోర్టులో పిటిషన్లు వేశారు. వాటిపై విచారించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.శ్రీదేవి ఉత్తర్వులను రద్దు చేసేందుకు తగిన ఆధారాలు చూపలేదని, వాటిని కొట్టివేస్తూ తీర్పునిచ్చారు. పిటిషన్ ఖర్చుల కింద ముగ్గురూ రూ.10 వేల చొప్పున జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు చెల్లించాలని ఆదేశించారు.