Actor Nani : మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు తెలుగు సినిమా ఇండస్ట్రీలో సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా హీరోయిన్ సమంత, అక్కినేని ఫ్యామిలీపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు వెంటనే వెనక్కి తీసుకోవాలని పలువురు సినీ ప్రముఖులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు తాజాగా ఇదే వివాదంపై హీరో నాని తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో రాజకీయ నేతల అర్థం లేని వ్యాఖ్యలను చూస్తే తనకు అసహ్యం వేస్తుందని మండిపడ్డారు.
తమ ప్రజల పట్ల వారికి ఏ మాత్రం బాధ్యత లేకుండా అనవసర విషయాలను మీడియా ముందు ప్రస్తావిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వంలో ఓ గౌరవప్రదమైన స్థానంలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధాకరమన్నారు. ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు మంత్రి కొండా సురేఖకు ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని ఆక్షేపించారు. సమాజంపై చెడు ప్రభావాన్ని చూపే ఇలాంటి చర్యలను సినీ ఇండస్ట్రీలో ఉన్నవారే కాకుండా అందరూ ముక్తకంఠంతో ఖండించాలని హీరో నాని పిలుపునిచ్చారు.