Indian Bison : నల్లమల అడవుల్లో 154 ఏళ్ల క్రితం కనిపించిన ఒక జంతువు హఠాత్తుగా ప్రత్యక్షమైంది. 1870లో కనిపించి అదృశ్యమైన ఈ జంతువు తిరిగి కనిపించడంతో అటవీ అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. భారత అడవి దున్న (ఇండియన్ బైసన్)గా గుర్తింపు ఉన్న ఈ దున్నలు 1870కి ముందు నల్లమల అడవుల్లో విస్తారంగా సంచరించేవి. 1870 లో అనూహ్యంగా కనిపించకుండా పోయాయి. ఇప్పుడు కనిపించి అటవీ అధికారులు, ప్రకృతి ప్రియులకు ఆశ్చర్యాన్ని కలిగించింది.
నాగార్జున సాగర్–శ్రీశైలం పులుల అభయారణ్యంలోని ఆత్మకూరు డివిజన్‌లో బైర్లూటి, వెలుగోడు నార్త్ బీట్‌లో ఇండియన్ బైసన్ గెంతుతూ కనిపించింది. ప్రస్తుతం నల్లమలకు తూర్పున ఉండే పాపికొండలు (పోలవరం అటవీ ప్రాంతం).. కర్ణాటకలోని పశ్చిమ కనుమల్లో మాత్రమే ఉండే అడవి దున్న వందల కిలో మీటర్ల దూరాన్ని దాటుకొని నల్లమలకు చేరడం అద్భుతమైన విషయమే.
నెల క్రితమే..
ఆత్మకూరు అటవీ డివిజన్‌లోని బైర్లూటి రేంజ్ తలమడుగు అటవీ ప్రాంతంలో విధుల్లో భాగంగా ఫుట్ పెట్రోలింగ్ చేస్తున్న సిబ్బందికి నెల క్రితం అడవి దున్న కనిపించింది. వెంటనే వీడియో, ఫొటోలు తీసిన సిబ్బంది ఉన్నతాధికారులకు వివరించారు. అయితే.. దీన్ని రహస్యంగా ఉంచారు. ఆ తర్వాత ఇదే అటవీ డివిజన్‌లోని వెలుగోడు రేంజ్‌లోని నార్త్ బీట్ జీరో పాయింట్ వద్ద సిబ్బందికి మరో సారి కనిపించి నేనున్నానని చెప్పింది.
అప్రయత్నంగానే..
ఒకప్పుడు నల్లమల అడవిలో విస్తారంగా సంచరించి కనిపించకుండా పోయిన అడవి దున్నలను తిరిగి తీసుకచ్చేందుకు అటవీ శాఖ ఇటీవల ప్రయత్నాలు మొదలు పెట్టింది. వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ (డబ్లూడబ్ల్యూఎఫ్) సంస్థ కూడా తము సహకరిస్తామని ముందుకొచ్చింది. ఫార్మాస్యూటికల్ కంపెనీ రెడ్డీస్ ల్యాబ్ ఈ కార్యక్రమం కోసం రూ. కోటి విరాళానికి అంగీకరించింది. అటవీ అధికారులు ఈ ప్రాజెక్టును చేపట్టే ప్రయత్నాలు చేస్తున్న సమయంలోనే ఈ బైసన్ తనంతట తానే పూర్వ ఆవాసానికి చేరుకోవడంతో వన్యప్రాణి ప్రేమికుల్లో పండుగ వాతావరణం కనిపిస్తోంది. నల్లమల అడవుల్లో ఇండియన్ బైసన్ ప్రత్యక్షమవడం శుభసూచకంగా భావిస్తున్నారు.
ఆశ్చర్యమే కానీ.. అసాధ్యం కాదు
ఆత్మకూరు డివిజన్‌లో అడవి దున్నను సిబ్బంది రెండు ప్రాంతాల్లో గుర్తించారు. ఇది ఆశ్చ్యర్యం కలిగించే విషయమే. కానీ.. అసాధ్యం కాదు అని ఒక అటవీ అధికారి వివరించారు. పెద్ద పులులు, ఏనుగులు లాంటి జంతువులు సుదూర ప్రాంతాలకు వలస వెళ్లడం జరుగుతూనే ఉంటుంది. ఇందులో భాగంగానే అడవి దున్న మైదాన ప్రాంతాలను దాటుకొని నల్లమల చేరి ఉంటుంది. ఏపీలోని పాపికొండలు అటవీ ప్రాంతం నుంచి రావచ్చని భావిస్తున్నాం. ఇది ఎలా వచ్చిందనేది పూర్తిగా తెలుసుకుంటే మరిన్ని వలస వచ్చే అవకాశాలను సుగమం చేయవచ్చు.