JAISW News Telugu

Director VV Vinayak : కాకినాడ లేదా ఏలూరు ఎంపీగా వీవీ వినాయక్?  ఆ పార్టీ నుంచే పోటీ?

Director VV Vinayak

Director VV Vinayak

Director VV Vinayak : ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ మాస్ మూవీలకు కేరాఫ్ అడ్రస్. హీరోలకు మాస్ ఇమేజ్ తెప్పిండంలో ఆయనకు ఆయనే సాటి. దిల్ రాజు తొలిసారి నిర్మాతగా మారి తీసిన చిత్రం ‘దిల్’తో వినాయక్ దర్శకుడిగా తన కెరీర్ ను ప్రారంభించారు. తర్వాత ఎన్టీఆర్ తో ‘ఆది’ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఆది మూవీతోనే ఎన్టీఆర్ కు మాస్ ఇమేజ్ వచ్చిందనే చెప్పాలి. రాజమౌళి తర్వాత ఎన్టీఆర్ కెరీర్ కు ఉపయోగపడ్డది వినాయకే అనే చెప్పాలి. మెగాస్టార్ తో వినాయక్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ‘ఠాగూర్’ తీశారు. ఆ తర్వాత ఖైదీ నంబర్ 150 కూడా తీసి చిరుకు కమ్ బ్యాక్ బ్లాక్ బస్టర్ ఇచ్చారు. బాలయ్యతో చెన్నకేశవరెడ్డి, వెంకటేశ్ తో ‘లక్ష్మి’ వంటి సూపర్ హిట్ సినిమాలు తీశారు.

ఇటీవల ఆయన సినిమాలు తగ్గించారు. దాదాపు లేవనే చెప్పాలి. తాజాగా ఆయన రాజకీయాల వైపు మొగ్గుతున్నట్టు కనిపిస్తోంది. త్వరలోనే వైసీపీ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం. వినాయక్ సొంతూరు పశ్చిమ గోదావరి జిల్లాలోని చాగల్లు. వినాయక్ మొదటి నుంచి వైఎస్ జగన్ కు మద్దతుదారుగా ఉన్నారు. అందుకే రాబోయే ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేయడానికి రెడీ అవుతున్నట్టు సమాచారం.

వినాయక్..ఏలూరు లేదా కాకినాడ నుంచి లోక్ సభకు పోటీ చేసే అవకాశాలు కనపడుతున్నాయి. ఈయన కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం కూడా వైసీపీకి కలిసి వస్తుందని జగన భావిస్తున్నారట. రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ గెలవాలన్నా బీసీ, కాపు సామాజికవర్గాల మెజారిటీ ఓట్లు ఎవరికీ పడుతాయో వారే గెలుస్తారనేది తెలిసిందే. ఇందులో భాగంగానే ఇటు జగన్, అటు చంద్రబాబు, పవన్ సామాజిక వర్గాల కోసం మద్దతు కోసం ప్రయత్నిస్తున్నారు.

జగన్, చంద్రబాబును పక్కన పెట్టేస్తే స్వయంగా కాపు సామాజిక వర్గానికి చెందిన పవన్ కు ఈ ప్రాంతంలో సానుకూల అంశాలు ఉన్నాయి. అందుకే జగన్ ..ఉభయ గోదావరి జిల్లాల్లో పవన్ ను ఢీకొట్టడానికి తాను కూడా కాపు సామాజికవర్గాన్ని ఉపయోగించుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే అదే సామాజిక వర్గానికి చెందిన వినాయక్ ను తెరమీదకు తెస్తున్నట్టు తెలుస్తోంది. దీని ద్వారా పవన్ ఆ ప్రాంతాల్లో ఎదుర్కొవచ్చని భావిస్తున్నారు.

అదే విధంగా కాపు ప్రముఖులను, కాపు రాజకీయ నేతలను వైసీపీ నుంచి పోటీ చేయించే వ్యూహాలు పన్నుతున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే వినాయక్, ముద్రగడ పద్మనాభం వంటి వారిని వైసీపీలోకి ఆహ్వానిస్తున్నట్టు సమాచారం. దీంతో పాటు వినాయక్ పొలిటికల్ ఎంట్రీతో వైసీపీకి సినీ గ్లామర్ రావడంతో పాటు మిగతా వారిని ఆకర్షించవచ్చు అనే ప్లాన్ లో జగన్ ఉన్నారని తెలుస్తోంది.

కాగా, వినాయక్ మెగా ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడు. ఆయన చిరంజీవిని సొంత అన్నగా భావిస్తారు. పవన్ తో కూడా స్నేహంగానే ఉంటారు. మరి పవన్ కు చెక్ పెట్టేందుకు జగన్ కు పావుగా మారుతారా? లేదా అనేది చూడాలి. ఒకవేళ వైసీపీ నుంచి పోటీ చేసినా పవన్ పై విమర్శలు చేస్తారా? అనేది కూడా మున్ముందు తెలియనుంది. వైసీపీ కాపు సామాజికవర్గ ఓట్లను చీల్చడానికి రచిస్తున్న వ్యూహాలు.. కాపుల్లో పవన్ కల్యాణ్ పై బలంగా ఉన్న అభిమానాన్ని ఎదుర్కొనగలవా? అనేది ఎన్నికల తర్వాతే వెల్లడి కానుంది.

Exit mobile version