Lok Sabha Elections 2024 : రాజకీయాలంటే ఎవరికైనా ఇష్టమే. ఎంతటి సంపన్నుడికైనా చివరి తీరం రాజకీయాలే. ఎమ్మెల్యేగా, ఎంపీగా సమయం కలిసివస్తే మంత్రిగా, ముఖ్యమంత్రిగా కావాలని కలలు కంటారు. రెగ్యులర్ పొలిటీషియన్స్ ఉన్నా కూడా అప్పుడప్పుడు వివిధ రంగాల నుంచి కూడా రాజకీయాల్లోకి షిఫ్ట్ అవుతుంటారు. ఐఏఎస్ లు గా పనిచేసిన ఉన్నత స్థాయి ఉద్యోగులు, వివిధ రంగాల్లో పేరుమోసిన వ్యక్తులు కూడా రాజకీయాల్లోకి రావాలనుకుంటారు. ఇక సినిమా రంగానికి, రాజకీయ రంగానికి అత్యంత దగ్గరి బంధం ఉంది. ఎంతో మంది సినిమా తారలు రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రులుగా, కేంద్ర, రాష్ట్ర మంత్రులుగా, ఎంపీ, ఎమ్మెల్యేలుగా సేవలందించారు.
మరో రెండు నెలల్లో లోక్ సభ ఎన్నికలు రాబోతున్నాయి. దీంతో పలువురు తెలుగు సినీ జనాలు రాజకీయాల వైపు చూస్తున్నారు. ఏపీలో జనసేనలో పలువురు సినిమావాళ్లు ఇటీవలే జాయిన్ అయ్యారు. ఇక తెలంగాణలో ఎంపీలుగా పోటీ చేసేందుకు ఇద్దరు నిర్మాతలు రెడీ అయిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ కాంగ్రెస్ లో ఉన్న విషయం తెలిసిందే. ఈయన మల్కాజిగిరి స్థానం నుంచి పోటీ చేసేందుకు దరఖాస్తు చేసుకున్నారు. అలాగే బడా నిర్మాత దిల్ రాజు నిజామాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేయడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.
దిల్ రాజు నిజామాబాద్ జిల్లాకు చెందినవారే. ఇప్పటికే ‘మాపల్లె చారిటబుల్ ట్రస్ట్’ పేరిట తన స్వగ్రామం నర్సింగ్ పల్లితో పాటు నిజామాబాద్ పరిసర ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు చేస్తోంది దిల్ రాజు కుటుంబం. అయితే నిజామాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి కూడా ఈ స్థానాన్ని ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ఆకుల లలిత కూడా పోటీలో ఉన్నారు.
ఇక మల్కాజిగిరి నుంచి మైనంపల్లి హన్మంతరావు కూడా పోటీ చేయాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఆయన మెదక్ పై కూడా ఓ కన్నేసినట్టు తెలుస్తోంది. కాగా, మల్కాజిగిరి టికెట్ తనకే వస్తుందని బండ్ల గణేశ్ నమ్మకంగా ఉన్నారట.