KCR Difficulties In Gajwel : గజ్వేల్ లో సీఎం కేసీఆర్ కు గడ్డు పరిస్థితులేనా.. గెలుపు ఏకపక్షం కాదా..?
KCR Difficulties In Gajwel : తెలంగాణ సీఎం కేసీఆర్.. ఉద్యమసారథిగా కోట్లాది గుండెల్లో హీరో. వరుసగా రెండుసార్లు తెలంగాణలో తన పార్టీని గెలిపించుకున్నాడంటే కారణం కూడా అదే. తెలంగాణ సెంటిమెంట్. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. తెలంగాణలో వ్యతిరేకత మొదలైంది. దానిని పలు సందర్భాల్లో కేసీఆర్ కూడా ఒప్పుకున్నారు. అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేయడంలో కొంత విఫలమైనట్లు పలు సందర్భాల్లో మాట్లాడారు. అయితే ఆయన ఇప్పుడు తాను రెండు సార్లు విజయం సాధించిన నియోజకవర్గంలోనే తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు.
సీఎం కేసీఆర్ ఎక్కడి నుంచి నిలబడ్డా విజయం ఖాయం. ఇప్పటికీ ఆ పరిస్థితులే ఉన్నా, ఎక్కడో భయం ఆయనను గజ్వేల్ నుంచే కాకుండా కామారెడ్డి నుంచి కూడా పోటీలో నిలిచేలా చేసింది. ఈ సారి గజ్వేల్ లో పరిస్థితి అంత ఈజీగా లేదనేది ఆయన ముందుగానే గుర్తించారు. ఇక్కడ ప్రధానంగా మల్లన్నసాగర్, కొండపొచమ్మ రిజర్వాయర్ నిర్వాసితుల నుంచి పెద్ద చిక్కే ఉంది. వారి డిమాండ్లు నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైంది. దీంతో పాటు భూ సేకరణ సమయంలో జరిగిన అవకతవకలు కూడా కేసీఆర్ పై వ్యతిరేకతను మరింత పెంచింది.
ఇక అందుకే సీఎం కేసీఆర్ కామారెడ్డిలో కూడా తన నామినేషన్ వేశారు. గజ్వేల్ లో కేసీఆర్ ను ఓడించాలని బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ పంతం పట్టారు. ఈ సారి హుజూరాబాద్ నుంచే కాకుండా ఆయన కూడా గజ్వేల్ లో నామినేషన్ వేశారు. ఇక కాంగ్రెస్ అభ్యర్థి తూంకుంట నర్సారెడ్డిక కూడా ఇప్పుడు అక్కడ బలమైన ప్రత్యర్థిగా ఎదిగారు. అయితే గతంలో ఇక్కడి నుంచి రెండు సార్లు పోటీచేసిన ఒంటేరు ప్రతాపరెడ్డి ఇప్పుడు కేసీఆర్ వెంట ఉన్నారు. ఇప్పుడు ఆయన అధినేత గెలుపు కోసం పనిచేస్తున్నారు. అయితే ఇక్కడ కూడా వర్గ విభేదాలు కొంత సమస్యగా మారాయి. అయితే సీఎం కేసీఆర్ నుంచి ఇక్కడి నుంచే గెలిచే అవకాశమున్నా, ఏదో అనుమానం ఆయనను కామారెడ్డి వైపు కూడా నడిపించింది. గ్రౌండ్ లెవల్ రిపోర్ట్ తర్వాతే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తున్నది. నిజానికి సొంత నియోజకవర్గంలోనే ఇంత వ్యతిరేకత ఉంటే, మరి రాష్ర్ట వ్యాప్తంగా కూడా ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవాలని ప్రతిపక్షాలు చెబుతున్నాయి. నల్లేరు మీద నడకలా సాగాల్సిన కేసీఆర్ విజయం.. ఏకపక్షమేమి కాకపోవడానికి దారితీసిన పరిస్థితులేంటో ఇప్పుడు బేరీజు వేసుకోవాల్సిన సమయం వచ్చింది.